Vivek Ramaswamy | అమెరికాలో ట్రంప్ సర్కార్ కొత్తగా ఏర్పాటు చేసిన ‘డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్న్మెంట్ ఎఫిషియెన్సీ’(డోజ్) నుంచి భారత సంతతి రాజకీయ నాయకుడు వివేక్ రామస్వామి వైదొలిగిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే ఆయన ఈ మేరకు నిర్ణయం ప్రకటించడంపై సర్వత్రా చర్చకు దారితీసింది. దీని వెనక టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) హస్తం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై రామస్వామి తాజాగా స్పందించారు. ఆ ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపారేశారు. అంతేకాకుండా మస్క్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.
మస్క్‌తో విభేదాలపై ఫ్యాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. డోజ్ శాఖకు సంబంధించి తాము అనుసరించిన మార్గాలు భిన్నవైనవే అయినా పరస్పరం అనుకూలమైనవే అని తెలిపారు. తాను రాజ్యాంగం, చట్టాల ఆధారిత వైఖరిని నమ్ముతానని తెలిపారు. ఇక మస్క్ టెక్నాలజీపై మంచి పట్టు ఉందని.. సాంకేతిక, డిజిటల్ విధానంలో దిశానిర్దేశం చేసే వ్యక్తి మస్క్‌కు మించిన వారు మరొకరు ఉండరేమో అని అన్నారు. అంతే తప్ప ఇద్దరి మధ్యా ఎలాంటి విభేదాలు లేవని రామస్వామి క్లారిటీ ఇచ్చారు.
డోజ్ నుంచి వైదొలగిన వివేక్ రామస్వామి
ఇటీవలే జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం వివేక్ రామస్వామి పోటీ పడిన విషయం తెలిసిందే. చివరికి రేసు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ట్రంప్ గెలుపుకై తీవ్రంగా శ్రమించారు. ఈ నేపథ్యంలోనే తన గెలుపులో కీలక పాత్ర పోషించిన వివేక్ రామస్వామితోపాటు ఎలాన్ మస్క్‌కు తన కార్యవర్గంలో ట్రంప్ కీలక పదవులను కట్టబెట్టారు.
తన కార్యవర్గంలో కీలకమైన డోజ్ (DOGE) (డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ) బాధ్యలను వారిద్దరికీ అప్పగించారు. మెరుగైన పాలన, ప్రభుత్వంలో వృథా ఖర్చుల్ని తగ్గించే ఎఫీషియెన్సీ శాఖకు వారిద్దరూ నేతృత్వం వహిస్తారని ట్రంప్ తెలిపారు. అయితే, ట్రంప్ ఈనెల 20వ తేదీన అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే రామస్వామి ఈ అనూహ్య నిర్ణయం ప్రకటించడం గమనార్హం. ‘డోజ్ రూపకల్పనలో సాయం చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ప్రభుత్వాన్ని క్రమబద్దీకరించడంలో మస్క్ అతడి బృందం సఫలీకృతం అవుతుందని భావిస్తున్నా’ అని వివేక్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అయితే, రామస్వామి నిర్ణయం వెనుక పెద్ద కారణమే ఉందని తెలిసింది. ఒహైయో గవర్నర్‌గా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో వివేక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ‘ఓహియోలో నా భవిష్యత్తు ప్రణాళికల గురించి త్వరలో మరిన్ని విషయాలు చెప్పాల్సి ఉంది. ముఖ్యంగా అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా తీర్చిదిద్దడంలో అధ్యక్షుడు ట్రంప్‌కు మేమంతా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని రామస్వామి పేర్కొన్నారు.
Also Read..
“Vivek Ramaswamy | ట్రంప్ కార్యవర్గం నుంచి వివేక్ రామస్వామి ఔట్.. కారణం ఇదేనా..?”
“H1 B Visa | మాకు విదేశీ నిపుణులు అక్కర్లేదు.. హెచ్1బీ వీసాపై అమెరికన్ల మనోగతం!”
“Elon Musk | భారీ సంస్కరణలు అత్యవసరం.. హెచ్-1బీ వీసాలపై మాట మార్చిన మస్క్”