H1 B Visa | వాషింగ్టన్, జనవరి 1: అగ్రరాజ్యం అమెరికాలో హెచ్-1బీ వీసాలపై అటు రాజకీయ నేతల్లో, ఇటు పౌర వర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్నది. వాస్తవానికి హెచ్-1బీ వీసా ద్వారా విదేశీయులను రప్పించాల్సిన స్థితిలో అమెరికా లేదని ఆ దేశానికి చెందిన మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తక్కువ స్థాయిలో నైపుణ్యం గల గ్రాడ్యుయేట్లను అమెరికా తయారు చేస్తున్నదన్న వాదనను వారు కొట్టిపారేస్తున్నారు. రాస్మూసేన్ అనే సంస్థ తాజా నివేదిక ప్రకారం వైట్ కాలర్ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వడానికి, నియమించడానికి నిపుణులైన ఉద్యోగులు, కార్మికులు ఇప్పటికే దేశంలో తగినంత మంది ఉన్నారని, కొత్తగా నిపుణులైన విదేశీయులను రప్పించాల్సిన అవసరం లేదని మెజార్టీ అమెరికన్లు స్పష్టం చేస్తున్నారు.
ఇటీవల జరిపిన ఈ సర్వేలో అధిక శాతం హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని విస్తృతం చేయాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పారు. ఇప్పటికే అమెరికా కావల్సినంత మంది నిపుణులను కలిగి ఉందని 60 శాతం పౌరులు అభిప్రాయపడ్డారు. కొత్తగా విదేశాల నుంచి రప్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ దృక్పథం రిపబ్లికన్లలో బలంగా ఉంది. 65 శాతం స్వింగ్ ఓటర్లు, 47 శాతం డెమోక్రాట్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, 26 శాతం మాత్రమే కొత్త నైపుణ్యాన్ని తీసుకురావాలని పేర్కొన్నారు.
అమెరికాలో ప్రధాన కంపెనీలైన అమెజాన్, గూగుల్, టెస్లాల్లో ప్రధాన ఉద్యోగాల్లో నియామకానికి ఈ హెచ్-1బీపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. స్థానికంగా తమకు సరిపడా నిపుణులైన సిబ్బంది లభ్యం కావడం లేదని, తమ సంస్థలు పూర్తి స్థాయిలో పనిచేయాలంటే విదేశాల నుంచి రప్పించే వారిపైనే ఆధారపడక తప్పదని, కార్మిక అంతరాలను ఈ విధానం పూరిస్తుందని ఇవి పేర్కొంటున్నాయి. అయితే వీరి కారణంగా స్థానికులైన అమెరికన్లు వేతన అణచివేతకు గురవుతున్నారని, చవకగా వచ్చే నిపుణుల కారణంగా వారి ఉపాధి అవకాశాలు దెబ్బతినడమే కాక, శ్రమదోపిడీకి గురవుతున్నారని మరికొందరు వాదిస్తున్నారు.
అమెరికాలోని కంపెనీలలో పనిచేయడానికి నిపుణులైన విదేశీ కార్మికులు, ఉద్యోగులను కంపెనీలు రప్పించుకునేందుకు హెచ్-1బీ వీసాలను ప్రభుత్వం జారీ చేస్తుంది. దీని కారణంగా భారత్, చైనా లాంటి దేశాల్లోని నిపుణులకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో ఈ వీసాల సంఖ్య తగ్గిస్తారని తొలుత ప్రచారం జరిగినా తన ముఖ్య సలహాదారులు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డీఓజీఈ) సంయుక్త సారథులుగా నియమితులైన ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి లాంటి వారు ఈ వీసా విధానానికి మద్దతు ఇచ్చారు. టాలెంట్ ఎక్కడున్నా ప్రోత్సహించాలన్నది వారి వాదన. తర్వాత ట్రంప్ సైతం వారికి మద్దతుగా గళం కలిపారు. తాను ఎల్లప్పుడూ ఈ వీసా విధానానికి అనుకూలమేనని ప్రకటించారు. దీంతో ట్రంప్ పార్టీలోనే దీనిపై భేదాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.