శనివారం 23 జనవరి 2021
International - Jan 04, 2021 , 21:21:06

ఆఫ్రికా స్ట్రైయిన్‌పై కరోనా టీకాలు పనిచేయవు!

ఆఫ్రికా స్ట్రైయిన్‌పై కరోనా టీకాలు పనిచేయవు!

లండన్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా టీకా ప్రక్రియ ఊపందుకుంటున్న తరుణంలో బ్రిటన్‌ ఆరోగ్య శాఖ కార్యదర్శి మాట్ హాన్కాక్ బాంబు పేల్చారు. దక్షిణ ఆఫ్రికాలో బయటపడిన కరోనా స్ట్రైయిన్‌పై వ్యాక్సిన్లు పనిచేయవని ఓ శాస్త్రవేత్త పేర్కొన్నారని తెలిపారు. ఆఫ్రికా రకం కరోనా వైరస్‌ గురించి తనకు చాలా ఆందోళనగా ఉన్నదని సోమవారం అన్నారు. బ్రిటన్‌ కరోనా స్ట్రైయిన్‌ను దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన కరోనా టీకాలు ఆఫ్రికా స్టైయిన్‌పై పని చేస్తాయా అన్న సందేహాన్ని ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారుల్లో ఒకరు చెప్పడమే తన ఆందోళనకు కారణమన్నారు. 

కాగా బ్రిటన్‌  స్ట్రైయిన్ కన్నా దక్షిణాఫ్రికాలోని కొత్త వేరియంట్ చాలా భిన్నంగా ఉన్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. మానవ కణాలకు సోకడానికి వైరస్ ఉపయోగించే ముఖ్యమైన "స్పైక్" ప్రోటీన్‌లో బహుళ ఉత్పరివర్తనలు ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బ్రిటన్‌ ప్రజలకు ఇస్తున్న కరోనా టీకా దక్షిణ ఆఫ్రికా వేరియంట్‌పై పని చేస్తుందా లేదా అన్న దానిపై ప్రభుత్వ వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో రెజియస్ మెడిసిన్ ప్రొఫెసర్ జాన్ బెల్ ఆదివారం పెద్ద ప్రశ్నలేవనెత్తారు. ఒకవేళ ఆఫ్రికా స్ట్రైయిన్‌పై ఈ వ్యాక్సిన్‌ పని చేయకపోతే మరో వ్యాక్సిన్‌ తయారికి కొంత సమయం పట్టవచ్చని అభిప్రాయపడ్డారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo