USA vs China : అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ కంట్రీ చైనా ట్రేడ్ వార్‌లో ఢీ అంటే ఢీ అంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) మొదలు పెట్టిన టారిఫ్ వార్‌ను చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. డ్రాగన్ దేశం నుంచి వచ్చే వస్తువులపై అమెరికా 104 శాతం సుంకం విధించగా.. అమెరికా ఉత్పత్తులపై తాము 84 శాతం సుంకం విధిస్తున్నామని చైనా తాజాగా ప్రకటించింది. ఏప్రిల్ 10 నూతన టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని చైనా ఆర్థిక శాఖ ప్రకటించింది.
ఇటీవల చైనాపై అమెరికా సుంకాలు విధించడంతో ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధించాలని చైనా నిర్ణయించింది. దాంతో భగ్గుమన్న ట్రంప్.. ఏప్రిల్ 8లోగా చైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. లేకుంటే అదనంగా మరో 50 శాతం ప్రతీకార సుంకం విధిస్తానని బెదిరించారు. ఇచ్చిన గడువు ముగిసినా చైనా స్పందించకపోవడంతో తాను చెప్పినట్లుగానే చేశారు.
గతంలో విధించిన 54 శాతానికి అదనంగా 50 శాతం జోడించడంతో చైనాపై అమెరికా విధించిన సుంకాలు 104 శాతానికి చేరుకున్నాయి. దాంతో అమెరికా అహంకారంతో వ్యవహరిస్తోందని, బెదిరింపులకు పాల్పడుతోందని చైనా ఆరోపించింది. అమెరికా టారిఫ్‌లకు ప్రతిగా తాము కూడా ఆ దేశ ఉత్పత్తులపై మరో 50 శాతం సుంకాలను పెంచుతున్నామని ప్రకటించింది.