USA visas : అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అక్రమ వలసదారుల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సరైన పత్రాలు లేకుండా తమ దేశంలో ఉంటున్న వారిని నిర్ధాక్షిణ్యంగా స్వదేశాలకు పంపిస్తున్నారు. అక్రమంగా అమెరికాకు వచ్చిన ఆఫ్రికా పౌరులు చాలామందిని ఇటీవల తమ దేశాలకు తిరిగి పంపారు. అయితే వారిని స్వీకరించడానికి ఆయా ఆఫ్రికా దేశాలు నిరాకరించాయి.
దాంతో ట్రంప్ కన్నెర్ర చేశారు. అక్రమ వలసదారుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. యూఎస్‌కు వెళ్లిన ఆయా దేశాల పౌరులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారి వీసాలను ట్రంప్ యంత్రాంగం రద్దు చేస్తోంది. ఇమిగ్రేషన్ చట్టాల అమలును వేగవంతం చేసే ప్రయత్నాలలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో శనివారం ప్రకటించారు.
డిపోర్టేషన్ విషయంలో తన ప్రవర్తన మార్చుకొని, సమస్యను పరిష్కరించే వరకు దక్షిణ సూడాన్‌కు చెందిన వారి వీసా అపాయింట్మెంట్లను రద్దు చేశామని, కొత్త వీసాల జారీ ప్రక్రియను నిలిపివేస్తున్నామని మార్కో రూబియో ప్రకటించారు. దాంతో అక్కడి పౌరులు ఎవరూ వీసాపై అమెరికాలోకి ప్రవేశించే అవకాశం ఉండదన్నారు. దక్షిణ సూడాన్ పాస్‌పోర్ట్‌దారులకు అమెరికాలో ఉన్న ఏ వీసాలకు విలువలేదని చెప్పారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు.
ఆఫ్రికా దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారని రూబియో చెప్పారు. దక్షిణ సూడాన్ ట్రంప్ పరిపాలనా విధానానికి సహకరించినప్పుడు మాత్రమే ఈ కఠిన నియమాలను సమీక్షిస్తామని ఆయన పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు రెండోసారి అధ్యక్షుడు అయినప్పటి నుంచి దాదాపు ఎనిమిది వేల మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లు వైట్‌హౌస్ వెల్లడించింది.
వీరిలో కొందరిని వెనక్కి పంపించగా మరికొందరు జైళ్లలో, ఇంకొందరు నిర్బంధ కేంద్రాల్లో ఉన్నారని తెలిపింది. కొందరు విదేశీ విద్యార్థులు జాతి వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ గుర్తించింది. స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ వారికి మెయిల్స్ పంపింది. కేవలం ఆందోళనల్లో పాల్గొన్నవారికే కాకుండా అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన విద్యార్థులకు కూడా ఈ హెచ్చరిక సందేశాలు పంపినట్లు తెలుస్తోంది.
యునైటెడ్ స్టేట్స్ ఇమిగ్రేషన్, అమెరికా జాతీయచట్టంలోని సెక్షన్ 221 (i) ప్రకారం వారి వీసాలు రద్దు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా పేర్కొంది.