మంగళవారం 26 జనవరి 2021
International - Jan 05, 2021 , 11:16:45

ఆ డీల్ ఆప‌క‌పోయారో.. ఇండియాకు అమెరికా వార్నింగ్‌

ఆ డీల్ ఆప‌క‌పోయారో.. ఇండియాకు అమెరికా వార్నింగ్‌

వాషింగ్ట‌న్‌: ఇండియాకు మ‌రోసారి వార్నింగ్ ఇచ్చింది అగ్ర‌రాజ్యం అమెరికా. ర‌ష్యాతో ఇండియా చేసుకున్న ఎస్‌-400 ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ కొనుగోలు డీల్‌పై అమెరికా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ డీల్‌పై ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యిస్తే ఇండియాపై ఆంక్ష‌లు త‌ప్ప‌వ‌ని యూఎస్ కాంగ్రెష‌న‌ల్ రిపోర్ట్ హెచ్చరించింది. అక్క‌డి కాంగ్రెస్‌కు రిపోర్ట్ చేసే ది కాంగ్రెష‌న‌ల్ రీసెర్చ్ స‌ర్వీస్ (సీఆర్ఎస్‌) ఈ నివేదిక‌ను రూపొందించింది. ఇదొక స్వతంత్ర సంస్థ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ సంస్థే ఇప్పుడు ఇండియాపై ఆంక్ష‌లు విధించాల‌ని సూచిస్తోంది. ర‌ష్యా నుంచి ఇండియా ఎస్‌-400 ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను కొనుగోలు చేయ‌డం అనేది.. కౌంట‌రింగ్ అమెరికాస్ అడ్వ‌ర్సరీస్ త్రూ సాంక్ష‌న్స్ యాక్ట్ కింద ఇండియాపై అమెరికా ఆంక్ష‌ల‌కు కార‌ణ‌మ‌వుతుంద‌ని సీఆర్ఎస్ స్ప‌ష్టం చేసింది. 

ఈ సీఆర్ఎస్ ఇచ్చింది అధికారిక నివేదిక కాక‌పోయినా.. దీని ఆధారంగా అమెరికా చ‌ట్ట స‌భ‌ల ప్ర‌తినిధులు నిర్ణ‌యాలు తీసుకునే వీలు క‌లుగుతుంది. ఇండియా, ర‌ష్యా 2018, అక్టోబ‌ర్‌లో 500 కోట్ల డాల‌ర్ల విలువైన ఎస్‌-400 మిస్సైల్‌ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా ఐదు మిస్సైల్ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ల‌ను ర‌ష్యా.. ఇండియాకు అందించ‌నున్న‌ది. అమెరికా మొద‌టి నుంచీ హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నా.. ఈ డీల్‌పై ముందుకే వెళ్లాల‌ని ఇండియా నిర్ణ‌యించింది. ఇప్ప‌టికే ర‌ష్యాతో ఇదే డీల్ కుదుర్చుకున్న ట‌ర్కీపై అమెరికా ఆంక్ష‌లు విధించిన విష‌యం తెలిసిందే.


logo