US – Iran : ప్రస్తుతం ఇరాన్ లో ఆందోళనలు ఉధృతమవుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ పై అమెరికా దాడి చేసే అవకాశాలున్నాయని అమెరికా ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
ఇరాన్ లో ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. రోడ్లెక్కి నిరనసలు, భారీ ఆందోళనలకు దిగుతున్నారు. దీంతో వారిని అణచివేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ ఘటనలో 72 మందికి పైగా మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. దీంతో ఆందోళనకారుల్ని అడ్డుకుంటే వారికి మద్దతుగా తమ సైన్యం రంగంలోకి దిగుతుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ పై దాడి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ట్రంప్ అన్నారు. అయితే, ఈ అంశంపై ట్రంప్ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని, కానీ, దీని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారని అమెరికా సైన్యాధికారులు అంటున్నారు. ఈ దాడులు పరిమితంగానే ఉండొచ్చని వారు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని ఎంపిక చేసిన వాటిపైనే దాడులు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. టెహ్రాన్ లోని కొన్ని స్థావరాలు, అక్కడి సైనిక క్యాంపుల్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
గత డిసెంబర్ చివరి వారం నుంచి ఇరాన్ ప్రజలు తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. ఇరాన్ అధినేత అయతొల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఆయన పదవి నుంచి దిగిపోవాలని కోరుతున్నారు. మరోవైపు అమెరికా హెచ్చరికలున్నా.. ఆయన అక్కడి ప్రజల్ని తీవ్రంగా అణచివేస్తున్నారు. అయితే, ఇరాన్ చేస్తున్న ఆందోళనలు ఇతర దేశాల్లోనూ కొనసాగుతున్నాయి. లండన్ లోని ఇరాన్ ఎంబసీపైకి ఇరాన్ పౌరులు, మద్దతుదారులు దూసుకెళ్లారు. అక్కడి ఇస్లామిక్ జాతీయ జెండాను తొలగించి, 1970లో ఉన్న ఇరాన్ జెండాను ఎగరేశారు.