Tammy Bruce : భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) తో సంబంధాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని, ఆ రెండు దేశాలతోనూ తమకు సత్సంబంధాలు కొనసాగుతున్నాయని అమెరికా (USA) పేర్కొంది. పాకిస్థాన్ సైనిక నాయకత్వంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) జరుపుతున్న చర్చలవల్ల ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టమ్మీ బ్రూస్ తెలిపారు.
తమ దేశానికి అందరితో మాట్లాడే అధ్యక్షుడు ఉండటంవల్ల విభేదాలను పరిష్కరించడం సులువవుతుందని టమ్మీ బ్రూస్ వ్యాఖ్యానించారు. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బ్రూస్ పైవిధంగా బదులిచ్చారు. ‘పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో ట్రంప్ బంధం.. మోదీతో సంబంధాలపై ప్రభావం చూపుతుందా..?” అని మీడియా ప్రశ్నించగా.. ‘రెండు దేశాలతో మా సంబంధాలు ఎప్పటిలాగే బలంగా ఉన్నాయి. ఇకపై కూడా వాటిలో ఎలాంటి మార్పు ఉండబోదు’ అని ఆమె చెప్పారు.
అందరితో చర్చలు జరపడం ద్వారానే సమస్యలకు పరిష్కారాలు కనుగొనగలమని ఆమె ట్రంప్ దౌత్యాన్ని సమర్థించారు. ఇటీవల భారత్, పాకిస్థాన్ మధ్య తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలను తమ జోక్యంతోనే నివారించగలిగామని ఆమె వ్యాఖ్యానించారు. ‘ఆ ఘర్షణ భయంకరమైనదిగా మారే ప్రమాదం ఉండె. అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో తక్షణమే స్పందించి దాడులను ఆపారు. ఇరు పక్షాలను చర్చలకు ఒప్పించారు. ఇది మాకు ఎంతో గర్వకారణమైన క్షణం’ అని టమ్మీ బ్రూస్ అన్నారు.
అయితే భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణలో అమెరికా జోక్యం ఉందన్న వాదనను భారత్ గతంలోనే తోసిపుచ్చింది. ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) ల మధ్య జరిగిన చర్చల ద్వారానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని స్పష్టంచేసింది. అయినా అమెరికా మళ్లీమళ్లీ తమ జోక్యం ఉందని చెప్పుకుంటోంది. ఇదిలావుంటే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మాత్రం భారత్-పాకిస్థాన్ మధ్య మధ్యవర్తిత్వానికిగానూ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని సిఫారసు చేశారు.