న్యూయార్క్ : డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లు, ఇంటర్వ్యూలను నిలిపివేసింది. వలసలపై కఠిన నియమాలు అమలు చేయడంలో భాగంగానే అపాయింట్మెంట్లను నిలిపివేసినట్టు యూఎస్ విదేశాంగశాఖ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అమెరికా రాయబార కార్యాలయాల్లోని వీసా అధికారులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, అందుకే వీసా ఇంటర్వ్యూలను నిలిపివేసినట్టు యూఎస్ విదేశాంగశాఖ ప్రకటించింది.
అమెరికా ప్రభుత్వ ప్రజా సంక్షేమ ప్రయోజనాలపై ఆధారపడే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు వీసా అధికారులకు శిక్షణ ఇస్తున్నట్టు అమెరికా తెలిపింది. ఇప్పటికే వీసాల కోసం ఐప్లె చేసుకున్న వారికి ఇంటర్వ్యూ రీ షెడ్యూల్ చేసినట్టు మెయిల్స్ ద్వారా సమాచారం వెళ్లింది. తాత్కాలిక వీసాలపై వచ్చి శాశ్వతంగా అమెరికాలోనే ఉండిపోవాలి అనుకునేవారి వీసాలను గుర్తించి రద్దు చేసే ప్రక్రియను కూడా ట్రంప్ ప్రభుత్వం చేపట్టింది. ఇందులో దాదాపు 2లక్షలకు పైగా వీసాలు రద్దయ్యే అవకాశం ఉన్నది. అమెరికా వీసా ఇంటర్వ్యూలను ఆపేయడంతో అత్యవసరంగా చదువులు, ఉద్యోగాల కోసం ఐప్లె చేసుకున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగాలు తరలిపోతాయ్..
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో అమెరికా ఉద్యోగాలు విదేశాలకు తరలిపోతాయని ఇండియన్-అమెరికన్ అడ్వొకసీ గ్రూప్ హెచ్చరించింది. హెచ్-1బీ వీసాతో పాటో ఓపీటీ ప్రోగ్రామ్‌పై లక్ష డాలర్ల అధిక ఫీజులను విధించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదనపై ద ఫౌండేషన్ ఫర్ ఇండియన్ అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ బుధవారం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఈ అధిక ఫీజుల వల్ల విదేశీ ఉద్యోగులను నియమించుకునే కంపెనీలపై మిలియన్ల డాలర్ల అదనపు భారం పడుతున్నదని అప్పుడు అమెరికా వెలుపల కంపెనీలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఈ సంస్థ తెలిపింది. హెచ్-1బీ, ఓపీటీలపై 1,03,265 డాలర్ల ఫీజును విధిస్తే అమెరికాకు ఇతర దేశాల నిపుణులు తగ్గిపోతారని.. ఇప్పటికే యూఎస్ యూనివర్సిటీల్లో విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గినట్టు వివరించింది.
భారీగా ప్రయోజనాలు తగ్గింపు..
ట్రంప్ ప్రభుత్వం వీసాల జారీలో అనేక కోతలు పెడుతూ ఫీజులు పెంచుతున్నది. సెప్టెంబర్ 9 నుంచి 50 లేదా అంతకంటే ఎక్కువ మంది హెచ్-1బీ లేదా ఎల్-1 వీసా ఉద్యోగులున్న అమెరికా కంపెనీలు.. హెచ్-1బీ పొడిగింపు కోసం 4వేల డాలర్లు, ఎల్-1 పొడిగింపు కోసం 4500 డాలర్లు చెల్లించాలని నిబంధన పెడుతున్నది. దీని వల్ల ఆయా ఉద్యోగుల ఖర్చులను కంపెనీలు భరించలేక తొలగించే ప్రమాదం కూడా ఉంది. ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులకు ఎఫ్-1 వీసా ఉంది. యూఎస్‌లో చదువుకున్నంత కాలం ఇది ఇప్పటిదాకా వర్తించేది. కానీ ఇప్పుడు నాలుడేండ్లకు దీన్ని పరిమితం చేశారు. అంతకంటే ఎక్కువ కాలం కోర్సుల్లో చదివే విద్యార్థులు మళ్లీ అదనపు ఫీజుతో వీసాను పొడిగించుకోవాలి.
భారతీయులపైనే ఎక్కువ ప్రభావం
ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అందరికంటే భారతీయులే ఎక్కువ ప్రభావితం అవుతారని నివేదికలు చెబుతున్నాయి. ఎందుకంటే అమెరికాకు ఉద్యోగాలు, చదువుల కోసం వెళ్లే వారిలో భారతీయులదే అగ్రస్థానం. యూఎస్సీఐఎస్ లెక్కల ప్రకారం గతేడాది హెచ్-1బీ వీసా పొందిన వారిలో 75 శాతం భారతీయులే. ఇక విద్యార్థుల్లోనూ మన దేశం వారే ఎక్కువ ఇప్పుడు ఓపీటీతో పాటు హెచ్-1బీ వీసాల ఫీజులు పెంచితే భారతీయులకు యూఎస్‌లో ఉద్యోగాల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
2022లో వీసాల జారీ 55 శాతం ఉంటే 2025-26లో కేవలం 22 శాతమే ఉంది. ఇప్పుడు లక్ష డాలర్ల అదనపు ఫీజును సెప్టెంబర్ నుంచి విధించే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో కంపెనీలు కొత్త ఉద్యోగులను తీసుకోడానికే సంకోచిస్తాయి. అలాగే ఓపీటీపై లక్ష డాలర్ల ఫీజు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.95లక్షలకు పైగా కట్టాలి. అంత మొత్తం చదువులకే కట్టాల్సి వస్తే ఇక హెచ్-1బీ వీసాకు మరో లక్ష డాలర్లను చెల్లించడానికి అమెరికా కంపెనీలు సిద్ధపడుతాయా అన్నది అనుమానమే. 2024 నుంచి వరుసగా మూడేండ్ల పాటుగా వీసాల జారీలో 10 శాతం తగ్గుతూ వస్తున్నది.