Donald Trump | వాషింగ్టన్, ఫిబ్రవరి 11: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజుకో ప్రకటనతో సంచలనం సృష్టిస్తున్నారు. తాజాగా ఆయన రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భవిష్యత్తులో రష్యాలో ఉక్రెయిన్ భాగం కావొచ్చు, కాకపోవచ్చు, ఆ రెండు దేశాలు ఒక ఒప్పందానికి రావొచ్చు అని ట్రంప్ తెలిపారు. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధాన్ని ఆపేందుకు అవసరమైన ప్రయత్నాలన్నీ చేస్తున్నామని చెప్పారు.
గాజాలో హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను శనివారం మధ్యాహ్నం లోగా విడిచిపెట్టాలని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. అలా చేయకపోతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ముగించాలని ప్రతిపాదిస్తామని అన్నారు. కాగా,ఇప్పటివరకు ఉన్న గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గూగుల్ మ్యాప్ ఇక నుంచి గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చింది.