న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 79వ జన్మదినం వేళ నిరసనలతో అమెరికా అట్టుడికింది. ట్రంప్ వ్యతిరేకులతో శనివారం అమెరికా వీధులు, పార్క్‌లు నిండిపోయాయి. ప్రదర్శనకారులు పెద్ద ఎత్తున గుమికూడి ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. దాదాపు 2 వేల చోట్ల ‘నో కింగ్స్’ ప్రదర్శనలు జరిగాయి. డౌన్టౌన్లు, చిన్న పట్టణాలు గుండా కవాతు చేస్తూ ప్రజాస్వామ్యం, వలసదారుల హక్కులను పరిరక్షించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
యూఎస్ ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ భవనం ముందు నిరసన తెలిపిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోర్ట్‌ల్యాండ్ పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. యూటాలోని సాల్ట్‌లేక్ సిటీ డౌన్టౌన్లో జరిగిన మార్చ్ సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పులు జరిపిన వ్యక్తిగా భావిస్తున్న నిందితుడితోపాటు ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
న్యూయార్క్, డెన్వర్, షికాగో, ఆస్టిన్, లాస్ఏంజిలిస్లలో ట్రంప్ వ్యతిరేకులు భారీ కవాతు నిర్వహించారు. డ్రమ్స్ వాయిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొందరు ‘నో కింగ్స్’ బ్యానర్లు ప్రదర్శించారు. అట్లాంటాలో 5 వేల మంది, సియాటిల్ ర్యాలీకి 70 వేల మందికిపైగా హాజరయ్యారు. మరోవైపు, తన పుట్టిన రోజు నాడే జరిగే ఆర్మీ 250 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే సైనిక కవాతులో పాల్గొనేందుకు ట్రంప్ వాషింగ్టన్లో ఉన్నారు. వాయువ్య వాషింగ్టన్‌లోని లోగస్ సర్కిల్లో దాదాపు 200 మంది నిరసనకారులు గుమికూడి ‘ట్రంప్ మస్ట్ గో నౌ’ (ట్రంప్ ఇప్పుడే వెళ్లాలి) అని నినదించారు. ఈ సందర్భంగా ట్రంప్ కిరీటం ధరించి, బంగారు టాయిలెట్‌పై కూర్చున్న వ్యంగ్య చిత్రాన్ని ప్రదర్శించారు.