న్యూఢిల్లీ: ఇరాన్‌తో యుద్ధం, ప్రపంచ భద్రతా బాధ్యతలతో ఖర్చులను తడిసి మోపెడవుతున్న నేపథ్యంలో 2027 సంవత్సరానికిగాను 1.5 ట్రిలియన్ డాలర్ల (రూ.139 లక్షల కోట్లు) భారీ రక్షణ బడ్జెట్‌ను ఆమోదించాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం చట్టసభ సభ్యులను కోరారు. సైనిక కార్యకలాపాలను కొనసాగించడానికి, క్షీణించిన ఆయుధ నిల్వలను పునర్నిర్మించడానికి అమెరికా ప్రయత్నిస్తున్నందున ఈ ప్రతిపాదన ఒక్క సంవత్సరంలోనే పెంటగాన్(రక్షణ శాఖ) వ్యయాన్ని 40 శాతానికి పైగా పెంచుతుంది.
ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత భారీ పెరుగుదల కానున్నది. అమెరికన్ కాంగ్రెస్ రహస్య సమావేశాలను అమెరికా మీడియా ఉటంకిస్తూ ఇరాన్ యుద్ధానికి రోజుకు 200 కోట్ల డాలర్ల వరకు ఖర్చవుతున్నదని పేర్కొంది. దీర్ఘకాలిక పునర్నిర్మాణం, పునఃసరఫరా ఖర్చులను పరిగణనలోకి తీసుకోకముందే ఈ భారం ఎంత తీవ్రంగా ఉందో ఇది స్పష్టం చేస్తున్నది. యుద్ధ సమయంలో సామాజిక కార్యక్రమాలకు నష్టం వాటిల్లినా సరే సైనిక పెట్టుబడికే ప్రాధాన్యత ఇవ్వాలని వాదిస్తూ ట్రంప్ రక్షణ పెంపును అత్యవసరమైనదిగా పేర్కొన్నారు.