న్యూయార్క్ : తన ప్రసంగాన్ని ఎడిట్ చేసి తప్పుగా ప్రసారం చేసిన బీబీసీ వార్తాసంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తెలిపారు. పనోరమా సిరీస్ డాక్యుమెంటరీ కోసం ట్రంప్ ప్రసంగాన్ని బీబీసీ వాడుకున్నది. కానీ ఆ ప్రోగ్రామ్‌లో ప్రజల్ని రెచ్చగొట్టే రీతిలో ట్రంప్ ప్రసంగాన్ని ఎడిట్ చేశారు. ఈ అంశంలో బీబీసీ సంస్థ ఇప్పటికే క్షమాపణలు చెప్పింది. ఆ కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు ఉన్నద ఉద్యోగులు కూడా రాజీనామా చేశారు. కానీ ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆ వార్తా సంస్థపై లీగల్ చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. నష్టపరిహారాన్ని కూడా వసూల్ చేయనున్నట్లు చెప్పారు.
కొన్ని రోజుల క్రితం ట్రంప్‌కు సారీ చెప్పిన బీబీసీ సంస్థ.. ఆయనకు నష్ట పరిహారాన్ని ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే శుక్రవారం ఎయిర్ ఫోర్స్ వన్‌లో రిపోర్టర్లతో మాట్లాడిన ట్రంప్.. వచ్చే వారం బీబీసీపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆ సంస్థపై కనీసం బిలియన్ నుంచి 5 బిలియన్ల డాలర్ల పరిహారాన్ని కోరనున్నట్లు వెల్లడించారు. 2021, జనవరి 6వ తేదీన చేసిన ప్రసంగాన్ని బీబీసీ తప్పుగా ఎడిట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
క్యాపిటల్ హిల్ హింసకు ప్రేరేపించినట్లు ఆ ప్రసంగంలో ఉన్నది. ఈ ఘటనతో లింకున్న బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవ్, న్యూస్ హెడ్ దెబోరా టర్నెస్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.