వాషింగ్టన్: చైనాతో వాణిజ్య యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తెరతీశారు. చైనా దిగుమతులపై 100 శాతం అదనపు టారిఫ్లు విధించడమే కాక, అమెరికా తయారు చేసే కీలకమైన సాఫ్ట్వేర్లపై కఠినమైన ఎగుమతి నియంత్రలను నవంబర్ 1 నుంచి అమలు చేస్తామని ట్రంప్ శుక్రవారం ప్రతిజ్ఞ చేశారు. ట్రంప్ ప్రకటనతో రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రారంభమయ్యాయి. వాణిజ్యంపై బీజింగ్ అసాధారణమైన దూకుడు వైఖరిని తీసుకుంటోందని, అదే తరహాలో అమెరికా కూడా స్పందిస్తుందని ట్రూత్ సోషల్లో ట్రంప్ చైనాను హెచ్చరించారు.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో త్వరలో జరగబోయే సమావేశాన్ని రద్దు చేస్తామని బెదిరించారు. ‘చైనా ఇకపై తీసుకునే చర్యలను బట్టి నవంబర్ 1 లేదా అంతకు ముందు ప్రస్తుతం వారు చెల్లిస్తున్న సుంకానికి మించి 100 శాతం టారిఫ్లను విధిస్తాం’ అని ఆయన తెలిపారు. అరుదైన ఖనిజాలపై బీజింగ్ కొత్త ఎగుమతి నియంత్రణలు విధించినందుకు ప్రతీకార చర్యగా ట్రంప్ ఈ సుంకాలను విధించారు.