అమృత్సర్, ఫిబ్రవరి 5: అగ్రరాజ్యం అమెరికాలో అక్రమంగా ఉంటున్న 104 మంది భారతీయులతో మొదటి సైనిక విమానం బుధవారం మధ్యాహ్నం అమృత్‌సర్‌కు చేరుకుంది. వీరిలో 19 మంది మహిళలు, 13 మంది మైనర్లు ఉన్నారు. రాష్ర్టాల వారీగా చూస్తే వీరిలో 30 మంది పంజాబ్, 33 మంది హర్యానా, 33 మంది గుజరాత్, మహారాష్ట్ర, యూపీల నుంచి ముగ్గురేసి, చండీగఢ్‌కు చెందిన ఇద్దరు ఉన్నారు. కాగా, భారత్‌కు చెందిన 205 మంది అక్రమ వలసదారులతో మంగళవారం సీ-17 మిలిటరీ విమానం టెక్సాస్ నుంచి బయలుదేరినట్టు వార్తలొచ్చాయి. అయితే వాస్తవానికి 104 మంది మాత్రమే విమానంలో వచ్చారు.
తనిఖీల తర్వాతే…
శ్రీ గురు రామ్‌దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు మధ్యాహ్నం 1.55 గంటలకు వలసదారులతో విమానం చేరుకుంది. వారిని ఒక టెర్మినల్‌లో ఉంచిన పోలీసులు వారి ఐడెంటిటీ, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా క్రిమినల్ చరిత్ర ఉందా అన్న విషయాన్ని నిశితంగా పరిశీలించారు. పూర్తిగా తనిఖీలు జరిపి నిర్ధారించుకున్న తర్వాతే వారిని పంపుతామని అధికారులు తెలిపారు. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమవలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. కాగా, తమ చేతులకు, కాళ్లకు సంకెళ్లు వేశారని, ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాతే వాటిని తొలగించారని జస్పాల్సింగ్ అనే ఓ వలసదారు వెల్లడించారు. సంకెళ్లు వేయడం ద్వారా భారతీయులను అవమానించారని కాంగ్రెస్ ధ్వజమెత్తింది.