వాషింగ్టన్ : గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రణాళికలను రచించాలని జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ (జేఎస్ఓసీ)ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ‘డైలీ మెయిల్’ కథనం ప్రకారం, ఈ ఆదేశాలపై అమెరికన్ మిలిటరీలో వ్యతిరేకత వచ్చింది. ఈ చర్య చట్టవిరుద్ధం, తప్పు, ఆచరణయోగ్యం కానిదని సైనికాధికారులు చెప్తున్నారు. మరోవైపు, ఈ ఏడాదిలోనే మిడ్ టెర్మ్ ఎన్నికలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్‌పై పట్టు కోల్పోతామని రిపబ్లికన్లు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే ట్రంప్ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారనే వాదన కూడా వినిపిస్తున్నది.
ఈ పత్రిక దౌత్యవర్గాలను ఉటంకిస్తూ చెప్పినది ఏమిటంటే, గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి సైనిక చర్యకు దిగడం అర్థరహితం, చట్టవిరుద్ధం అని సీనియర్ మిలిటరీ లీడర్స్ భావిస్తున్నారు. ఈ విషయంలో పంతం పట్టిన ట్రంప్‌తో వ్యవహరించడం, ఐదేండ్ల పిల్లాడితో వ్యవహరించడంలా ఉందని అంటున్నారు. గ్రీన్‌లాండ్‌పై అమెరికా దాడి చేస్తే, నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్)లోనే పెద్ద సంక్షోభం తలెత్తుతుందని తాజా నివేదిక హెచ్చరించింది. గ్రీన్‌లాండ్‌పై సైనిక చర్య అమెరికా, యూరోపియన్ నేతల మధ్య ప్రత్యక్ష ఘర్షణకు దారి తీస్తుందని తెలిపింది. ఫలితంగా ఈ సైనిక కూటమి కుప్పకూలుతుందని పేర్కొంది.