న్యూఢిల్లీ, జూన్ 15: దాదాపు నాలుగు నెలల యుద్ధాన్ని ముగించడానికి అమెరికా, ఇరాన్ ఒక శాంతి ఒప్పందంపై అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు సోమవారం ఒక అవగాహన ఒప్పందంపై వర్చువల్‌గా సంతకం చేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలీబాఫ్ ఇప్పటికే ఆ ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారని అమెరికా చెందిన ఉన్నతాధికారులు సోమవారం రాయిటర్స్ వార్తాసంస్థకు తెలిపారు. వచ్చే శుక్రవారం(జూన్ 19) దీనికి సంబంధించిన అధికారిక సంతకాల కార్యక్రమం జరగనుండగా ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు రానున్న 48 గంటల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.
యుద్ధం ప్రారంభం కావడానికి ముందు మధ్యవర్తిత్వ ప్రయత్నాలలో ఒమన్ పోషించిన పాత్ర పట్ల అమెరికా అసంతృప్తితో ఉందని ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు. అలాగే అమెరికాతో ఒప్పందంపై చర్చలు జరగడానికి, దానిపై సంతకం చేయడానికి ఇరాన్ పార్లమెంట్ స్పీకర్‌కు ఆ దేశ సుప్రీం నాయకుడి మద్దతు ఉందని ఆయన స్పష్టం చేశారు. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ ఉపసంహరణ అనేది ఈ ఒప్పందంలో ఒక షరతు కాదని ఆ అధికారి వివరించారు. అయితే ఇరాన్ దీనికి భిన్నమైన వాదనలు చేస్తున్నది.
ఇరాన్‌తో ఒప్పందం పూర్తయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. హొర్ముజ్ జలసంధిని ఎటువంటి రుసుములు లేకుండా తెరిచేందుకు తాను పూర్తి ఆమోదం తెలిపానని, అలాగే అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించేందుకు తక్షణమే అనుమతిస్తానని తెలిపారు. అమెరికాతో నెలల తరబడి సాగిన సుదీర్ఘమైన చర్చల అనంతరం రెండు దేశాలు ఒక ఒప్పందాన్ని ఖరారుచేశాయని ఇరాన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. వచ్చే శుక్రవారం (జూన్ 19) ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని మరో పోస్టులో ట్రంప్ తెలిపారు. జెనీవాలో అమెరికా-ఇరాన్ ఒప్పంద సంతకాల కార్యక్రమానికి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్నది. మూడు నెలల క్రితం ప్రారంభమైన ఈ ఘర్షణలను ముగించడానికి అమెరికా-ఇరాన్ కుదుర్చుకునే ఒప్పంద కార్యక్రమానికి పాక్ ఆతిథ్యం ఇస్తుందని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోమవారం ప్రకటించారు.
ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేసే కార్యక్రమం జూన్ 19న జెనీవాలో జరుగుతుందని ఆయన తెలిపారు. ఇలా ఉండగా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అమెరికాతో కుదిరిన ఒప్పందం చట్రంలో సముద్ర సేవలపై రుసుములు విధించే నిబంధనను ఇరాన్ తన ప్రకటనకు కొద్దిసేపటి ముందు చేర్చిందని ఇరాన్ ఫార్స్ న్యూస్ ఏజెన్సీ సోమవారం తెలిపింది. హొర్ముజ్ జలసంధిపై ఇరాన్, ఒమన్ దేశాలకు ఉన్న సార్వభౌమాధికార అంశాన్ని స్పష్టంగా, కచ్చితంగా నొక్కిచెప్పేలా చర్చల చివరి దశలో అవగాహన ఒప్పంద పత్రంలో సవరణలు చేశారని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ వార్తాసంస్థ పేర్కొన్నది.
అమెరికా-ఇరాన్ మధ్య తాజాగా ప్రకటించిన ఒప్పందాన్ని ఇజ్రాయెల్ తిరస్కరించింది. ఇది తమకు ఏమాత్రం వర్తించదని ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్‌గ్విర్ ప్రకటించారు. ట్రంప్ ఒప్పందం మమ్మల్ని బంధించదు. ఇజ్రాయెల్ అమెరికాకు లోబడి ఉండదు. మేము స్వతంత్ర, సార్వభౌమ దేశం అని ఆయన చెప్పారు. ఈ చట్టానికి అంతర్జాతీయ మద్దతు ఉన్నప్పటికీ ఒప్పందంలోని కొన్ని భాగాలకు ఆయన వ్యతిరేకతను సూచించారు. అమెరికాకు, ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలుపుతూనే ఇజ్రాయెల్ దేశం బనానా రిపబ్లిక్ కాదని బెన్‌గ్విర్ స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రి బెజాలెల్ స్మోట్రిచ్ కూడా ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందం ఇజ్రాయెల్‌కు, స్వేచ్ఛా ప్రపంచానికి మంచిది కాదని పేర్కొన్నారు.
ఆ పాలనను(ఇరాన్) కూలదోయడానికి మనం స్వయంగా సృజనాత్మక మార్గాల్లో ఉద్యమాన్ని కొనసాగించాలి. అలాగే ఇరాన్ వద్ద ఎప్పటికీ అణ్వాయుధాలు లేకుండా చూసుకోవాలిఅని ఎక్స్ పోస్టులో ఆయన పేర్కొన్నారు. లెబనాన్, సిరియా, గాజా నుంచి ఇజ్రాయెల్ వైదొలగబోదని రక్షణ మంత్రి కట్జ్ పునరుద్ఘాటించారు. ఒక అరుదైన ప్రకటనలో ఇజ్రాయెల్ ప్రతిపక్షం కూడా శాంతి ఒప్పందం పట్ల అసహనాన్ని వ్యక్తం చేసింది. ఈ ఒప్పంద ప్రకటన దేశానికి ఒక కఠినమైన ఉదయం లాంటిదని ఇజ్రాయెల్ డెమోక్రటిక్ పార్టీ నాయకుడు యైర్ గోలాన్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును విమర్శిస్తూ అమెరికా-ఇరాన్ ఒప్పందంతో మన పైలట్ల ధైర్యంతో, మన యోధుల రక్తంతో సాధించిన అపారమైన సైనిక విజయాలు తుడిచిపెట్టుకుపోయాయని ఆయన పేర్కొన్నారు.
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంలోని కీలక అంశాలలో ఒకటి లెబనాన్‌తో సహా అన్ని దేశాలలోనూ ఘర్షణలను విరమించుకోవడం. అయితే లెబనాన్‌లో తమ చర్యలను కొనసాగిస్తామని ఇజ్రాయెల్ పునరుద్ఘాటించింది. తాము ఆక్రమించుకున్న లెబనాన్‌లోని భూభాగాన్ని వదులుకోబోమని కూడా ప్రకటించింది. ఇరాన్ అణు, యురేనియం శుద్ధి చేసే ప్రక్రియకు సంబంధించిన అంశమే ఈ ఒప్పందానికి సంబంధించి ఇజ్రాయెల్‌కు ఉన్న ప్రధాన సమస్యని ఒక ఇజ్రాయెల్ అధికారిని ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్నది. స్తంభింపచేసిన ఇరాన్ ఆస్తుల విడుదల, లెబనాన్, యెమెన్, గాజా భూభాగంలోని అనుబంధ శక్తులకు ఇరాన్ అందిస్తున్న మద్దతు ఇజ్రాయెల్‌కు ఉన్న ఇతర సవాళ్లు.
యుద్ధాన్ని ముగించడానికి అమెరికా, ఇరాన్ ఒప్పందంపై డిజిటల్ సంతకాలు చేసిన మరుసటి రోజున చమురును నింపుకున్న నౌకలు హొర్ముజ్ జలసంధి గుండా బయల్దేరడం ప్రారంభించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం తెలిపారు. ఆ నౌకలు హొర్ముజ్ జలసంధిలోని దక్షిణ హైవే(రవాణా మార్గం) గుండా వెళుతున్నాయని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు. ఇది ఒమన్ తీరానికి ఆవల ఉన్న మార్గాన్ని సూచిస్తున్నట్లు కనిపిస్తున్నది.
1. లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో తక్షణం యుద్ధాన్ని నిలిపివేయాలి.
2. ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని అమెరికా హామీ ఇవ్వాలి. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి.
3. ఇరాన్ పోర్టులపై నావికా దిగ్బంధాన్ని 30 రోజుల్లోగా ఎత్తేయాలి.
4. ఇరాన్ అరేంజ్మెంట్స్ ప్రకారం.. హొర్ముజ్‌ను 30 రోజుల్లోగా తెరవాలి.
5. ఇరాన్ సరిహద్దుల నుంచి తక్షణం అమెరికా సైన్యాన్ని ఉపసంహరించాలి.
6. ఇరాన్‌పై ఆంక్షలు తొలగించాలి.
7. ఇరాన్ పునర్నిర్మాణానికి అమెరికా, దాని మిత్రపక్షాలు 300 బిలియన్ డాలర్ల ప్రణాళిక సమర్పించాలి.
8. అణు కార్యక్రమంపై తుది ఒప్పందానికి రావడానికి, అమెరికా ప్రాథమిక, అదనపు ఆంక్షల ఎత్తివేతకు, భద్రతా మండలి, ఐఏఈఏ బోర్డ్ఆఫ్ గవర్నర్స్ తీర్మానాల తొలగింపునకు 60 రోజుల్లో చర్చలు.
9. ఎన్పీటీ ఒప్పందం ప్రకారం అణ్వాయుధాలను తయారు చేయబోమని ఇరాన్ పునరుద్ఘాటించాలి.
10. చర్చల సమయంలో అమెరికా కొత్తగా ఈ ప్రాంతంలో బలగాలను మోహరించడం కాని, ఆంక్షలను విధించడం కాని చేయరాదు.
11. అమెరికా స్తంభింపజేసిన ఇరాన్‌కు చెందిన 24 బిలియన్ డాలర్లను విడుదల చేయాలి.
12. ఒప్పందం అమలుకు పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలి.
13. ఒప్పందాన్ని భద్రతా మండలి తీర్మానం ద్వారా ఆమోదించాలి.
14. స్తంభింపజేసిన ఇరాన్ నిధుల్లో సగం విడుదల చేసేవరకు, ఆంక్షలు ఎత్తివేసేవరకు తుది చర్చలు ప్రారంభం కావు.