న్యూయార్క్: అమెరికా విద్యాశాఖ(US Education Department)లో భారీ ప్రక్షాళన చేపడుతున్నారు. ఆ శాఖలో పనిచేస్తున్న సగం మంది ఉద్యోగుల్ని తొలగించనున్నారు. సామూహిక సెలవులు ప్రకటంచే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆ శాఖలో పనిచేస్తున్న సుమారు 2100 మంది ఉద్యోగులు మార్చి 21వ తేదీ నుంచి సామూహిక లీవ్ తీసుకోనున్నారు. విద్యాశాఖ ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని ఇటీవల ట్రంప్ ఆదేశించారు. అయితే ఉభయసభల ఆమోదంతోనే ఆ శాఖలో ప్రక్షాళన జరిగే అవకాశం ఉన్నది. విద్యాశాఖకు ప్రతి ఏడాది 238 డాలర్లు బడ్జెట్ను కేటాయిస్తారు. ఆ శాఖలో మొత్తం 4వేలకుపైగా ఉద్యోగులు ఉన్నారు.
అమెరికాలో విద్యాశాఖను 1979లో ఏర్పాటు చేశారు. పబ్లిక్ స్కూళ్ల ఫండింగ్ అంశాన్ని ఆ శాఖ చూసుకుంటుంది. విద్యార్థులకు రుణాలు ఇవ్వడం .. దిగువ ఆదాయ విద్యార్థులకు ప్రణాళికలు ప్రకటించడం లాంటి స్కీమ్లను ఆ శాఖ పర్యవేక్షిస్తుంది. ఉన్నత విద్య కోసం లక్షలాది మంది అమెరికా విద్యార్థులు తీసుకునే రుణాలపై విద్యాశాఖ ఫోకస్ పెడుతుంది. విద్యాశాఖ మిషన్లో భాగంగా.. ఉద్యోగుల సంఖ్యను 50 శాతం తగ్గిస్తున్నట్లు ఇటీవల ఆ శాఖ వెల్లడించింది. విద్యాశాక కార్యదర్శి లిండా మాక్మాహన్ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపారు. డిపార్లమెంట్లోని అన్ని విభాగాలపై ఉద్యోగ కోత ప్రభావం ఉంటుందని ఆమె తెలిపారు.
ట్రంప్ ప్రమాణ స్వీకార సమయంలో.. అమెరికా విద్యాశాఖలో మొత్తం 4133 మంది ఉద్యోగులు ఉన్నారు. అమెరికాలో మొత్తం 15 క్యాబినెట్ స్థాయి శాఖలు ఉండగా, దాంట్లో అతి తక్కువ ఉద్యోగులు ఉన్నది విద్యాశాఖే. ఉద్యోగుల కోత తర్వాత విద్యాశాఖలో కేవలం 2183 మంది మాత్రమే విధుల్లో ఉంటారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి జూన్ 9వ తేదీ వరకు పే బెనిఫిట్స్ ఉంటాయని నోటీసులో తెలిపారు.