అగ్రరాజ్యం అమెరికాకు డ్రాగన్ దేశం చైనా గట్టి వార్నింగ్ ఇచ్చింది. వచ్చే వారంలో అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పెలోసి.. తైవాన్ పర్యటనకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనను చైనా ఖండించింది. తైవాన్ తమ దేశంలో భాగమేనని చైనా చాలా కాలంగా గొంతు చించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే అమెరికా మాత్రం తైవాన్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉంది.
ఈ క్రమంలోనే చైనా అంటే మండిపడే పెలోసి.. తైవాన్ పర్యటనకు వెళ్లబోతోందని వార్తలు వచ్చాయి. వీటిపై చైనా విదేశాంగ మంత్రి ఝావో లిజియాన్ మాట్లాడుతూ.. చైనా ప్రభుత్వం ఈ పర్యటనను పూర్తిగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. ‘‘అమెరికా ఇదే పద్ధతిలో ప్రవర్తిస్తే.. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి చైనా చాలా కఠిన చర్యలు తీసుకోకతప్పదు. ఆ తర్వాత జరిగే పరిణామాలన్నింటికీ అమెరికానే బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని ఝావో హెచ్చరించారు.
అయితే పెలోసి పర్యటనపై అధికారికంగా ఎటువంటి ప్రకటనా రాలేదు. తైవాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి జోయాన్నె ఓ మాట్లాడుతూ.. అమెరికా దౌత్యవేత్తలను తమ దేశానికి స్వాగతించడం అనేది విదేశాంగ శాఖ ముఖ్యమైన బాధ్యతల్లో ఒకటని, ఏవైనా అధికారిక పర్యటనలు ఉంటే సరైన సమయంలో ఆ ప్రకటనలు చేస్తామని చెప్పారు.