టెహ్రాన్, ఏప్రిల్ 13 : ఇరాన్‌తో కీలక చర్చలు ఎటువంటి పురోగతి లేకుండా విఫలమైన తర్వాత వ్యూహాత్మకంగా కీలకమైన హొర్ముజ్ జలసంధి ద్వారా ఇరాన్ ఓడరేవులను కలిపే సముద్రమార్గాన్ని అమెరికా నౌకాదళం దిగ్బంధించడం ప్రారంభిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం చేసిన ప్రకటన అమలులోకి వచ్చింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్ ఓడ రేవుల్లోకి రాకపోకలు సాగించే నౌకలను లక్ష్యంగా చేసుకుని సోమవారం ఉదయం 10 గంటలకు(ఈఎస్ కాలమానం ప్రకారం) భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7.30 గంటలకు) ఈ దిగ్బంధం అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) తెలిపింది.
అరేబియా గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్సహా ఇరాన్ ఓడరేవులు, తీర ప్రాంతాలను ఉపయోగించే అన్ని దేశాల నౌకలపైన నిష్పాక్షికంగా ఈ చర్యను అమలు చేస్తున్నట్లు సెంట్కామ్ తెలిపింది. అయితే అమెరికా సైన్యం జలసంధిని పూర్తిగా మూసివేయలేదు. ఇరానేతర ఓడరేవులకు రాకపోకలు సాగించే నౌకల నౌకాయాన స్వేచ్ఛ కొనసాగుతుందని పేర్కొన్నది. ప్రపంచ నౌకా రవాణా మార్గాలకు పూర్తిగా అంతరాయం కలిగించకుండా, ఇరాన్‌ను ఏకాకిని చేయడమే లక్ష్యంగా ఇది ఒక క్రమబద్ధమైన విధానాన్ని అనుసరిస్తోందని సెంట్కామ్ సూచించింది. ఇరాన్ ఓడరేవుల్లోకి రాకపోకలు సాగించే అన్ని నౌకలకు ఈ దిగ్బంధం వర్తిస్తుందని సెంట్కామ్ తెలిపింది. తమ ఆదేశాలను ఉల్లంఘించిన నౌకలను అడ్డుకోవడం లేదా స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని స్పష్టంచేసింది.
ఇరాన్‌కు చట్టవిరుద్ధమైన సుంకాలు చెల్లించే ఏ నౌక అయినా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ నౌకాదళానికి చెందిన 158 నౌకలు పూర్తిగా నాశనమై సముద్ర గర్భంలో కూరుకుపోయాయని, తాము దెబ్బతీయనవి వారి వద్ద ఉన్న ఫాస్ట్ అటాక్ షిప్స్ అని పిలుచుకునే కొద్ది సంఖ్యలోని నౌకలు మాత్రమేనని ట్రంప్ పేర్కొన్నారు. తాము వాటిని పెద్ద ముప్పుగా పరిగణించడం లేదని, అయితే ఈ నౌకలలో ఏవైనా తమ దిగ్బంధనానికి సమీపంలోకి వస్తే సముద్రంలో పడవల్లోని డ్రగ్స్ వ్యాపారులపై తాము ఉపయోగించే అదే విధ్వంసక పద్ధితిని ఉపయోగించి వాటిని తక్షణమే నిర్మూలిస్తామని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా లేదా వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకునే ఇరాన్ బలగాలపై తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు. మాపై గాని, శాంతియుక నౌకలపై గాని కాల్పులు జరిపే ఏ ఇరానీయుడినైనా తునాతునకలు చేస్తాం అని ట్రంప్ పేర్కొన్నారు.
ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ వేగంగా స్పందించింది. హొర్ముజ్ జలసంధి సమీపంలో ఏ విదేశీ సైనిక ఉనికి అయినా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లుగానే పరిగణిస్తామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) హెచ్చరించింది. ఇరాన్ రేవులు, తీర ప్రాంతాలపై సోమవారం నుంచి దిగ్బంధం అమలు చేస్తామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో తమ రేవులకు ముప్పు వాటిల్లిన పక్షంలో పర్షియన్ గల్ఫ్ లేదా ఒమన్ సముద్రంలోని ఏ ఓడరేవు కూడా సురక్షితంగా ఉండబోదని ఐఆర్జీసీ హెచ్చరించింది. ప్రాంతీయ సముద్ర భద్రతను అందరూ పంచుకోవాలి. పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలో భద్రత అందరి కోసం లేదా ఎవరి కోసం కాదు. ఈ ప్రాంతంలోని ఏ ఓడరేవు కూడా సురక్షితంగా ఉండదు అని ప్రకటించింది.
ఉద్రిక్తతలు పెరగడంతో ఇదివరకు ప్రకటించిన కాల్పుల విరమణ కొనసాగింపుపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. గడువు ముగిసిన తర్వాత ఏమి జరుగుతుందనే దానిపై స్పష్టత లేదు. ఇరుపక్షాలు తదుపరి చర్చలకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ ఇరువైపులా మాటల దాడి పెరిగింది. దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో తదుపరి చర్చలకు మధ్యవర్తిత్వం వహించడానికి పాకిస్థాన్ ముందుకు రాగా రష్యా, ఈయూ వంటి ప్రపంచ శక్తులు సంయమనం పాటించాలని కోరుతున్నాయి.