లాస్ఏంజెల్స్, మార్చి 25 : ఒక పైలట్ పాస్‌పోర్టును మర్చిపోవడంతో విమానం తిరిగి వచ్చిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. లాస్ఏంజెల్స్ నుంచి చైనాకు యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూఏ 198 విమానం 257 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బందితో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరింది. అయితే షాంఘైకి ఆరు గంటల్లో చేరుకుంటారనగా, తాను పాస్‌పోర్ట్‌ను మర్చిపోయిన విషయం అందులోని ఒక పైలట్‌కు గుర్తుకు రావడంతో వేరే గత్యంతరం లేక విమానం యూటర్న్ తీసుకుంది. దానిని మధ్యాహ్నం 5 గంటలకు శాన్ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్టులో దించారు. తర్వాత కొత్త సిబ్బందితో రాత్రి 9 గంటలకు బయలుదేరిన విమానం ఆరు గంటలు ఆలస్యంగా షాంఘైకు చేరుకుంది. ఇది సిబ్బంది క్రమశిక్షణా రాహిత్యానికి నిదర్శనమని, ఎంతమాత్రం ఆయోదయోగ్యం కాదని పలువురు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.