UNGA | భారత్-పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ధాటించారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ట్రంప్ ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపుదాడులు నిర్వహించింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఇరుదేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ చాలాసార్లు చెప్పారు. తాజాగా మరోసారి యూఎన్ జనరల్ అసెంబ్లీలో ప్రకటించారు. భారత్-పాక్ యుద్ధంతో పాటు ఇజ్రాయెల్-ఇరాన్, కాంబోడియా-థాయ్‌లాండ్, కొసోవో-సెర్బియా, కాంగో-రువాండా, ఈజిప్ట్-ఇథియోపియా, ఆర్మేనియా-అజర్బైజాన్ యుద్ధాలను ఆపినట్లు చెప్పుకొచ్చారు. ఏ దేశం, ఏ అధ్యక్షుడు, ఏ ప్రధాని యుద్ధాలు ఆపే ప్రయత్నం చేయలేదని.. గతంలో ఎన్నడూ లేనివిధంగా కేవలం ఏడు నెలల్లో ఏడు యుద్ధాలను ఆపినట్లు ట్రంప్ తెలిపారు. దేశాల మధ్య యుద్ధాలను ఆపడం గౌరవంగా భావిస్తున్నానని.. ఐక్యరాజ్య సమితి చేయాల్సిన పనులను తాను చేయాల్సి రావడం బాధాకరమన్నారు.
ఏ విషయంలోనూ ఐక్యరాజ్య సమితి సహాయం చేసేందుకు ప్రయత్నించలేదని.. యుద్ధాలు ఆపేందుకు ఆయా ఆదేశాల నాయకులతో చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. ఒప్పందం ఖరారులో సహకరానికి యూఎన్ నుంచి ఫోన్ కాల్ కూడా రాలేదన్నారు. ఈ సందర్భంగా భారత్‌పై మరోసారి ట్రంప్ విమర్శలు గుప్పించారు. భారతదేశం, చైనాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు కూడా ఆయన విమర్శించారు. సుంకాలు, అణ్వాయుధాలు, అక్రమ వలసలు అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. రష్యా చమురును కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్‌లో జరుగుతున్న రష్యా యుద్ధానికి చైనా, భారతదేశం నిధులు సమకూరుస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు ఆరోపించారు. నాటో దేశాలు కూడా రష్యా ఇంధనం, రష్యన్ ఇంధన ఉత్పత్తులపై మరిన్ని ఆంక్షలు విధించలేదని ట్రంప్ ఆరోపించారు. ఈ విషయం రెండు వారాల కిందట తనకు తెలిసిందని.. దానిపై తాను సంతోషంగా లేనన్నారు. వారంతా యుద్ధాలకు నిధులు సమకూరుస్తున్నారని.. యుద్ధం ముగించేందుకు రష్యా ఒప్పందం చేసుకునేందుకు సిద్ధంగా లేకపోతే కఠినమైన సుంకాలు విధించేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్నారు.
ఈ నిర్ణయం చాలా త్వరగా రక్తపాతాన్ని ఆపేస్తుందని తాను నమ్ముతున్నానని.. సుంకాలు ప్రభావవంతంగా ఉండాలంటే.. యూరోపియన్ దేశాలు అదే చర్యలు తీసుకోవాలని, అమెరికాతో కలవాలన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలమైందని.. సరిహద్దులు కూడా బలమైనవని తెలిపారు. సైన్యంతో పాటు స్నేహం సైతం బలమైందని పేర్కొన్నారు. ఇది అమెరికా స్వర్ణయుగమని ట్రంప్ పేర్కొన్నారు. భూమిపై వ్యాపారం చేయడానికి అమెరికా ఉత్తమ దేశమని.. అమెరికాను గతంలో ఎన్నడూ లేని విధంగా గౌరవిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితిని విమర్శించారు. ఐక్యరాజ్యసమితికి అపారమైన సామర్థ్యం ఉందని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నానని.. కానీ అది ఆ సామర్థ్యాన్ని చేరుకోవడానికి దగ్గరగా కూడా లేదన్నారు. ఐక్యరాజ్యసమితి ఖాళీగా ఉందని.. యుద్ధాలను అంతం చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు స్టేట్ హోదా ఇవ్వాలనే ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించారు. గాజాలో యుద్ధం వెంటనే ఆగిపోవాలన్నారు. 20 మంది బందీలను ఎటువంటి ఆలస్యం లేకుండా విడుదల చేయాలన్నారు. ట్రంప్ అధ్యక్షుడు ట్రంప్ తన ప్రసంగాన్ని ప్రారంభించిన సమయంటో టెలిప్రాంప్టర్ సరిగా పని చేయలేదు. టెలిప్రాంప్టర్ లేకుండా మాట్లాడటానికి తనకు అభ్యంతరం లేదని ట్రంప్.. దాన్ని నిర్వహిస్తున్నారో వారు ఇబ్బందుల్లో ఉన్నారని తాను చెప్పగలనని పేర్కొన్నారు.