ఐరాస: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికకు (Gaza Peace Plan) ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదం తెలిపింది. రెండేండ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి (Israel Hamas War) ముగింపుపలికేందుకు 20 సూత్రాల ప్రణాళికను డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ బలగాల నియోగం, యుద్ధ విరామం, పునర్నిర్మాణం, పాలనకు మార్గదర్శకాలు ఇందులో ఉన్నాయి. ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్-పాలస్తీనా తీవ్రవాద గ్రూపు హమాస్ గత నెల 10న సంతకాలు చేశాయి.
ఐక్యరాజ్యసమితో సోమవారం జరిగిన ఓటింగ్‌లో అమెరికా, యూకే, ఫ్రాన్స్, సోమాలియా సహా మొత్తం 13 దేశాలు గాజా శాంతి ప్రణాళికకు మద్దతు తెలిపాయి. వీటో అధికారం ఉన్న రష్యా, చైనా ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. గత నెలలో యుద్ధ విరామం, బందీల విడుదల ఒప్పందంతో ప్రణాళిక మొదటి దశను అమలు చేసిన సంగతి తెలిసిందే. బోర్డ్ ఆఫ్ పీస్ అనే తాత్కాలిక సంస్థను ఏర్పాటు చేసి.. గాజా పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించాలన్నది గాజా ప్లాన్ ఉద్దేశం.
కాగా, ఈ తీర్మానాన్ని హమాస్ ఖండించింది. ఇది గాజా ప్రజల స్వతంత్రతను హరించడమేనని మండిపడింది. పాలస్తీనా ప్రజల స్వాతంత్ర్యం, స్వయంపాలన హక్కులను ఈ తీర్మానం గౌరవించడంలేదని, ఇక్కడి ప్రజల రాజకీయ ఆకాంక్షలను పక్కన పెట్టి తాత్కాలిక పాలనా సంస్థ పేరుతో ఇతర దేశాల నిర్ణయాలను రుద్దే ప్రయత్నంగా కనిపిస్తున్నదని విమర్శించింది. గాజా భవిష్యత్తును గాజా ప్రజలే నిర్ణయించాలని, విదేశీ బలగాలు, పాలనా సంస్థలు తమ అభిప్రాయాలను రుద్దకూడదని పేర్కొంది.
రెండేళ్ల క్రితం ఇజ్రాయెల్‌పై హమాస్ అనూహ్య దాడితో యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడికి దిగింది. దాదాపు 1,200 మందిని హతమార్చి, 250 మందికిపైగా బందీలుగా చేసుకుంది. హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో 67,000 మందికిపైగా పాలస్తీనా పౌరులు మరణించారు. ఇజ్రాయెల్ దాడుల్లో వేలాది ఇళ్లు నేలమట్టం కాగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులై టెంట్లలో తలదాచుకుని జీవిస్తున్నారు. వేలాదిమంది ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు.