లండన్ : ప్రపంచవ్యాప్తంగా టాప్ యూనివర్సిటీల గ్రాడ్యుయేట్లను దేశంలోకి ఆకర్షించేందుకు బ్రిటన్ న్యూ వీసా ప్రోగ్రాంను ప్రవేశపెట్టింది. హై పొటెన్షియల్ ఇండివిడ్యువల్ (హెచ్పీఐ) వీసా పేరిట ముందుకొచ్చిన న్యూ వీసా కోసం మే 30 నుంచి గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. న్యూ వీసా పాలసీ కింద అత్యధిక నైపుణ్యాలున్న విదేశీ యూనివర్సీటీ గ్రాడ్యుయేట్లు తమ డిగ్రీ లెవెల్‌కు అనుగుణంగా రెండు మూడేండ్ల పాటు బ్రిటన్‌లో ఉండేందుకు, పని చేసేందుకు వెసులుబాటు కలుగుతుంది.
దీంతో హెచ్పీఐ వీసాదారుల స్పాన్సర్షిప్ ఫీజు చెల్లించకుండానే వారిని హైర్ చేసేందుకు బ్రిటన్ కంపెనీలను హెచ్పీఐ వీసా పాలసీ అనుమతిస్తుంది. బ్రిటన్‌కు చేరుకున్న తర్వాత వీసాదారులు అక్కడ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో జాబ్ ఆఫర్ లేకుండానే ఆయా గ్రాడ్యుయేట్లకు బ్రిటన్‌కు చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. గత ఐదేండ్లుగా బ్రిటన్ వెలుపల అర్హత కలిగిన యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి 18 ఏండ్లు పైబడిన ఏ దేశీయులైనా హెచ్పీఐ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వీసా కోసం 715 పౌండ్లు వెచ్చించాల్సి ఉంటుంది. వీసాకు దరఖాస్తు చేసేందుకు 28 రోజుల ముందు అభ్యర్ధుల బ్యాంక్ ఖాతాలో కనీసం 1270 పౌండ్ల బ్యాలెన్స్ ఉండాలి. బ్రిటన్‌లో ఏడాది పైగా ఉంటున్న వారికి ఈ నిబంధన వర్తించదు. బ్యాచ్‌లర్, మాస్టర్స్ డిగ్రీ కలిగిన వారికి రెండేండ్ల వీసా, పీహెచ్డీ, డాక్టరేట్లకు మూడేండ్ల వ్యవధి కలిగిన వీసా జారీ చేస్తారు. దరఖాస్తుదారుతో పాటు జీవిత భాగస్వామి, డిపెండెంట్లను కూడా అనుమతిస్తారు. వీసా గడువు ముగిసిన తర్వాత నైపుణ్యం కలిగిన ఉద్యోగి, స్టార్టప్, ఇన్నోవేటర కింద పర్మిట్లను పొందవచ్చు.