కీవ్, ఏప్రిల్ 11: ఉక్రెయిన్ తీరప్రాంతం మరియుపోల్‌పై రష్యా జరుపుతున్న దాడుల్లో ఇప్పటివరకూ పదివేలమంది పౌరులు మరణించారని నగర మేయర్ బోయిచెన్కో తెలిపారు. ఉక్రెయిన్‌లోని సగం భూభాగంలో రష్యా బలగాలు అమర్చిన మందుపాతరలు, పేలని ఆయుధాలు ఉన్నాయని, వాటిని తొలగించాల్సిన అవసరమున్నదని ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ అధికారులు పేర్కొన్నారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలను ఆహారం, నీళ్ల కొరత వేధిస్తున్నది. ఆకలి కేకలతో మూడింట రెండోంతుల చిన్నారులు తల్లిదండ్రులతో కలిసి దేశాన్ని విడిచి వెళ్లినట్టు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 45.1 శాతం పతనమవ్వచ్చని ప్రపంచబ్యాంకు అంచనావేసింది. ఉక్రెయిన్‌తో జరుపబోయే చర్చల సమయంలో ఇంతకుముందులా దాడులను విరమించబోయేది లేదని రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్, ప్రధాని మోదీ సోమవారం రాత్రి చర్చించారు. యుద్ధం కారణంగా తలెత్తిన అస్థిరతను తొలగించేందుకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన భారతీయ విద్యార్థులకు సీట్లు ఖాళీగా ఉన్న కాలేజీల్లో ప్రవేశాలు కల్పించాలని కళాశాలలకు ఏఐసీటీఈ లేఖ రాసింది.