న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) రెండున్నర ఏడ్లుగా కొనసాగుతూనే ఉన్నది. 2022, ఫిబ్రవరి 24న కీవ్‌పై మాస్కో చేపట్టిన సైనిక చర్య ఎప్పుడు ముగుస్తుందనే విషయమై ఇప్పటికే స్పష్టతలేదు. ఈ క్రమంలో రష్యా దండయాత్ర మంగళవారంతో వెయ్యి రోజులకు చేరింది. దాడులు ప్రతిదాడులతో ఇరు దేశాలు వేలాది మందిని కోల్పోయాయి. లక్షలాది మంది గాయపడ్డారు. అనేక నగరాలు ధ్వంసమయ్యాయి. ఎన్నో గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఉక్రెయిన్ (Ukraine)లోనే 25 శాతం జనాభా తుడిచిపెట్టుకుపోయినట్లుగా అంచనా వేస్తున్నారు. ఇక వివిధ దేశాల్లో 60 లక్షల మంది శరణార్థులుగా జీవనం సాగిస్తున్నారు. 33 నెలలుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటివరకు సుమారు 80 వేల మంది ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 4లక్షల మంది గాయపడ్డారు. రష్యాకు చెందిన సుమారు 2లక్షల మంది సైనికులు చనిపోయినట్లు తెలుస్తున్నది. మరో 4లక్షల మంది వరకు గాయపడినట్లు సమాచారం.
కాగా, రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. యుద్ధంలో దీర్ఘశ్రేణి క్షిపణులను వినియోగించేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుమతించారు. దీంతో అమెరికా సరఫరా చేసిన ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్ (ఏటీఏసీఎం)ను వినియోగించేందుకు ఉక్రెయిన్‌కు అడ్డంకులు తొలిగిపోయాయి. చాలా రోజులుగా ఈ క్షిపణులను వినియోగించేందుకు అనుమతివ్వాలని అమెరికాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరుతున్నప్పటీ అమెరికా మాత్రం అంగీకరించడం లేదు. కుర్స్ సరిహద్దు ప్రాంతంలో ఇంతకుముందు ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్న తమ భూభాగాన్ని మళ్లీ దక్కించుకోవాలని రష్యా ప్రయత్నిస్తున్న వేళ బైడెన్ తన నిర్ణయాన్ని మార్చుకొని అంగీకరించారు. రష్యాకు ఉత్తర కొరియా పంపిన 12 వేల మంది సైనిక బలగాలను కుర్స్ సరిహద్దులో రష్యా మోహరిస్తున్నది. ఇదే సమయంలో దీర్ఘశ్రేణి క్షిపణులను యుద్ధంలో వాడేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అనుమతివ్వడంతో యుద్ధం మరింత తీవ్రం కానున్నదనే అనుమానాలు బలోపేతం అవుతున్నాయి.
మూడో ప్రపంచ యుద్ధం ముప్పు
అమెరికా నిర్ణయం యుద్ధంలో ఉద్రిక్తతలను పెంచే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘పాశ్చాత్య దేశాల ఆయుధాలను ఉక్రెయిన్ వినియోగించడం అంటే నాటో బలగాలు ప్రత్యక్షంగా యుద్ధానికి దిగినట్టే భావించాల్సి ఉంటుంది’ అని గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలను రష్యా అధికార ప్రతినిధి ద్మిత్రి పెస్కోవ్ గుర్తు చేశారు. జో బైడెన్ యంత్రాంగం మూడో ప్రపంచ యుద్ధం ముప్పును తీసుకొస్తున్నట్టే అని రష్యా ఎంపీ మారియా బుటినా వ్యాఖ్యానించారు. ‘ఇది మూడో ప్రపంచ యుద్ద ఆరంభం దిశగా వేసిన పెద్ద అడుగు. రష్యా వెంటనే స్పందిస్తుంది’ అని ఆ దేశ అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ డిప్యూటీ హెడ్ వ్లాదిమిర్ డ్జాబారోవ్ పేర్కొన్నారు. దీంతో రష్యా స్పందన ఎలా ఉంటుందో అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ట్రంప్ జోక్యం చేసుకుంటారా?
రెండు నెలల్లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో బైడెన్ తీసుకున్న నిర్ణయం అమెరికా రాజకీయాల్లోనూ కీలక పరిణామాలకు దారితీసే అవకాశముంది. తాను గెలిస్తే యుద్ధాన్ని వెంటనే ఆపేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాను రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ నిర్ణయంపై ట్రంప్ స్పందన ఎలా ఉంటుందనేది కీలకంగా మారింది.