Ukraine Finance | యుద్ధంతో అతలాకుతలమైన ఉక్రెయిన్ దేశం ఆర్థిక పరిస్థితి అంతకంతకూ దిగజారుతున్నది. ఆర్థిక పరిస్థులను మెరుగుపర్చుకునేందుకు ఉక్రెయన్ ప్రభుత్వం తమ ముందున్న అన్ని చర్యలపై దృష్టిసారించింది. ఆర్థిక లోటును భర్తీ చేసుకునేందుకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) నుంచి రుణం తీసుకోవాలని ఉక్రెయిన్ యోచిస్తున్నది. జెలెన్స్కీ ప్రతినిధులు పోలాండ్ రాజధాని వార్సాలో ఐఎంఎఫ్ అధికారులను ఈ వారంలో కలువనున్నారు. ఈ ఏడాది ఉక్రెయిన్ ఆర్థిక లోటు రూ.3 లక్షల కోట్లకు పైగా పెరుగుతుందని ఉక్రెయిన్ ఆర్థిక మంత్రి సెర్గీ మార్చెంకో ఈ నెల ప్రారంభంలో వెల్లడించారు.
అమెరికా నుంచి గ్రాంట్‌గా వచ్చిన రూ.81 వేల కోట్లతోపాటు యూరోపియన్ యూనియన్ నుంచి అందిన రూ.లక్ష కోట్లు కూడా ఆర్థిక లోటును భర్తీ చేసేవిగా లేవు. ఈ రెండు ప్రాంతాల నుంచి సాయం అందినప్పటికీ ఉక్రెయిన్‌కు ఇంకా రూ.లక్ష కోట్లు అవసరమవుతాయి. యుద్ధం ప్రారంభానికి ముందు ఉక్రెయిన్ ఆర్థిక నష్టం రూ.38 వేల కోట్లుగా ఉండగా.. 2022 లో 2 లక్షల కోట్లకు పెరిగింది. రష్యా చొరబాటు కారణంగా 2022 లో ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ 303 శాతం క్షీణించింది. ద్రవ్యోల్బణంలో 266 శాతం జంప్ నమోదైంది.
కాగా, ఉక్రెయిన్ నుంచి వచ్చిన జెలెన్స్కీ ప్రతినిధులతో సమావేశం అపాయింట్మెంట్ను ఐఎంఎఫ్ ధ్రువీకరించింది. అయితే ఇంతకు మించి సమాచారం ఇచ్చేందుకు ఆ సంస్థ అధికారులు నిరాకరించారు. యుద్ధం ముగిసిన కొన్ని వారాల తర్వాత ఉక్రెయిన్‌కు రూ.11 వేల కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు ఐఎంఎఫ్ ఆమోదించింది. దీంతో పాటు అక్టోబర్ నెలలో అదనంగా మరో రూ.10 వేల కోట్లు ఇస్తామని చెప్పినట్లుగా సమాచారం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తున్నది. ఆరు నెలలపాటు యుద్ధం పూర్తయిన తర్వాత రష్యా ఆర్థిక వ్యవస్థలో 6 శాతం వరకు క్షీణత ఉంటుందని ఐఎంఎఫ్ ఇదివరకు అంచనా వేసింది.