ఉక్రెయిన్పై రష్యా సేనలు చేస్తున్న దాడిని ప్రపంచ దేశాల్లో చాలా వరకు ఖండించాయి. ముఖ్యంగా పశ్చిమ దేశాలు, అమెరికా ఈ దాడిని తీవ్రంగా తప్పుపట్టాయి. ఈ క్రమంలోనే రష్యాపై విపరీతమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. రష్యా ధనవంతుల ఆస్తులు తమ దేశాల్లో ఉంటే వాటిని వెంటనే జప్తు చేస్తున్నాయి. దీనిపై చైనా వైస్ ఫారెన్ మినిస్టర్ లె యుచెంగ్ తప్పుబట్టారు.
రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడం చాలా దౌర్జన్యమని ఆయన అన్నారు. అలాగే నాటో విషయంలో రష్యా అభిప్రాయాన్ని కూడా సమర్ధించారు. ‘‘రష్యాపై విధిస్తున్న ఆంక్షలు రోజురోజుకూ విపరీతంగా మారుతున్నాయి. రష్యా ధనవంతుల ఆస్తులను ఎటువంటి కారణం లేకుండా జప్తు చేస్తున్నారు’’ అని ఆయన విమర్శించారు.
ఆంక్షలు విధించడం వల్ల సమస్యలకు ఎటువంటి పరిష్కారం లభించదని, ఈ విషయం చరిత్రలో పలుమార్లు రుజువైందని అన్నారు. ఈ ఆంక్షలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని, సామాన్యులపై వాటి భారం పడుతుందని, అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. నాటో తూర్పు వైపు విస్తరించకుండా 1997 నాటి సరిహద్దులకు వెళ్లిపోవాలని రష్యా డిమాండ్ చేస్తోంది.
దీనిపై మాట్లాడిన యుచెంగ్.. ‘‘సంపూర్ణ భద్రత కోసం నాటో చేస్తున్న పనులే.. అభద్రతకు దారి తీస్తున్నాయి. రష్యా వంటి బలమైన న్యూక్లియర్ శక్తిని కార్నర్ చేస్తే పరిణామాలు ఊహించలేనంత భయంకరంగా ఉంటాయి’’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఉక్రెయిన్లో రష్యా దళాల దాడిని చైనా ఇప్పటి వరకు ఖండించలేదు.
అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా రష్యాకు సహాయం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చైనాను బైడెన్ హెచ్చరించినట్లు సమాచారం.