దుబాయ్, జులై 6:యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం విదేశీయులకు ఓ కొత్త రకం గోల్డెన్ వీసాని ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్నట్లుగా భారీ మొత్తంలో ఆస్తులు లేదా వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టే విధానం కాకుండా నామినేషన్ ప్రాతిపదికన కొన్ని షరతులలో ఈ కొత్త వీసాను యూఏఈ ప్రభుత్వం జారీ చేయనున్నది. దుబాయ్ గోల్డెన్ వీసా పొందాలంటే భారతీయులు ఇప్పటి వరకు కనీసం 20 లక్షల ఏఈడీని(రూ. 4.66 కోట్లు) ఈ దేశంలోని వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టాల్సి ఉండేది. కొత్తగా ప్రారంభించిన నామినేషన్ ఆధారిత వీసా పాలసీ కింద జీవితకాల యూఏఈ గోల్డెన్ వీసా పొందాలంటే ఫీజు కింద 1 లక్ష ఏఈడీలను(సుమారు రూ. 23.30 లక్షలు) ఫీజుగా చెల్లిస్తే చాలని ఈ ప్రక్రియతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.
రానున్న మూడు నెలల్లో 5 వేల మందికి పైగా భారతీయులు ఈ నామినేషన్ ఆధారిత గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేయనున్నారని వారు చెప్పారు. తొలి దశ కోసం ప్రయోగాత్మకంగా భారత్, బంగ్లాదేశ్‌ను యూఏఈ ఎంపిక చేసింది. భారత్‌లో నామినేషన్ ఆధారిత గోల్డెన్ వీసా జారీ ప్రక్రియను ప్రయోగాత్మకంగా అమలు చేసే బాధ్యతను రయద్ గ్రూప్ కన్సల్టెన్సీకి అప్పగించారు. గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి సంబంధించిన మనీలాండరింగ్, ఇతర నేర చరిత్రతోపాటు, సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తామని రయద్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రయద్ కమల్ ఆయూబ్ తెలిపారు.
అనంతరం దరఖాస్తును యూఏఈ ప్రభుత్వానికి పంపుతామని, గోల్డెన్ వీసా జారీపై తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని ఆయన తెలిపారు. గోల్డెన్ వీసా పొందిన వ్యక్తులు తమ కుటుంబ సభ్యులను దుబాయ్‌కి తీసుకువెళ్లే స్వేచ్ఛ లభిస్తుందని, నౌకర్లు, డ్రైవర్లు వీసాదారుని వద్ద ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ వీసా ఉన్నవారు దుబాయ్‌లో ఏ వ్యాపారమైనా, ఉద్యోగమైనా చేసుకోవచ్చన్నారు.