ముంబై, అక్టోబర్ 9 : భారత దేశంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రెండు రోజుల పర్యటన సందర్భంగా ఇరు దేశాలు రక్షణ, వాణిజ్య సంబంధాలు మరింత పటిష్ఠం చేసుకున్నాయి. ఇరు దేశాల మధ్య 350 మిలియన్ బ్రిటీష్ పౌండ్ల (రూ.3,675 కోట్లు) విలువైన వివిధ రక్షణ ఒప్పందాలు కుదిరాయి. దీనిలో భాగంగా యూకే తయారీ లైట్ వెయిట్ మల్టీరోల్ మిస్సైల్స్ (ఎల్ఎంఎం)లు భారత ఆర్మీకి అందజేస్తారు. ఈ క్షిపణులు గగనతలం నుంచి గగనతలం, ఉపరితలం నుంచి గగనతలం, ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించ వచ్చు. భారత్-యూకే దేశాల మధ్య పెరుగుతున్న సంబంధాలను ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రశంసించారు. రెండు దేశాలను ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలపై ఆధారపడిన ‘సహజ భాగస్వాములు’ అని ఆయన పేర్కొన్నారు. జూలైలో భారత్-బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) జరిగింది.
బ్రిటన్ యూనివర్సిటీ క్యాంపస్లు భారత్లో ఏర్పాటుచేయడానికి రంగం సిద్ధమవుతున్నది. మొత్తం ఆరు యూకే వర్సిటీలు తమ క్యాంపస్లను భారత్లోని ఆయా నగరాల్లో ప్రారంభించేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. గురుగ్రామ్, బెంగళూర్, ముంబయి నగరాల్లో బ్రిటన్ వర్సిటీలు తమ క్యాంపస్లు ఏర్పాటు చేయబోతున్నాయి.