మనీలా: ఫిలిప్పీన్స్‌లో టైఫూన్ కాల్మేగీ(Typhoon Kalmaegi) పెను బీభత్సం సృష్టించింది. తీవ్ర స్థాయిలో వరదలతో నష్టం సంభవించింది. ప్రాణ నష్టం కూడా అధికంగా ఉంది. టైఫూన్ కాలమేగి వల్ల సుమారు 114 మంది మరణించినట్లు తెలుస్తోంది. 127 మంది మిస్సింగ్‌లో ఉన్నారు. సెంట్రల్ ప్రావిన్స్ సిబులో ఎక్కువగా నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. టైఫూన్ కాలమేగి వల్ల ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో నదులు, నీటి పాయలన్నీ ఉప్పొంగాయి.
టైఫూన్ వల్ల ఫిలిప్పీన్స్ వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ కూలింది. ఆ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. కాలమేగితో నష్టపోయిన ప్రావిన్సులకు సహాయ నిధి తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సెబు ప్రావిన్సు నుంచి ఎక్కువగా ప్రజలు సహాయం కోసం రెడ్‌క్రాస్‌కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. సెబులో వరదల్లో 49 మంది కొట్టుకుపోయారు.
కొండచరియలు విరిగిపడి కొందరు మరణించారు. 13 మంది మిస్సింగ్ అయినట్లు అధికారులు చెప్పారు. నీగ్రోస్ ఆక్సిడెంటల్, నీగ్రోస్ ఓరియంటల్ ప్రావిన్సుల్లో 62 మంది మిస్సైనట్లు తెలుస్తోంది. ఆకస్మిక వరదల వల్ల తమ ఇండ్లల్లోని ఫస్ట్ ఫ్లోర్లు మునిగిపోయాయని, దీంతో బిల్డింగ్ మీదకు ఎక్కాల్సి వచ్చిందని స్థానికులు అన్నారు.