Jeddah | సౌదీ అరేబియాలోని జడ్డా నగరాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. జడ్డా నగరంతోపాటు దాని పరిసర ప్రాంతాల్లో గురువారం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన ఎడతెరిపి లేని భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాల కారణంగా ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
గురువారం రాత్రి 8గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున 9 గంటలవరకు (కేవలం 6గంటల్లోనే) 179మి.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వరదలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరోవైపు పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వాతావరణం అనుకూలించని కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.
13ఏళ్ల క్రితం 2009లో కురిసిన వర్షానికి జడ్డా నగరం మునిగిందని .. మళ్లీ ఇప్పుడు అంతటి వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అప్పడు కురిసిన వర్షాల కారణంగా వచ్చిన వరదల్లో 123 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు.