నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 5 : యూరియాతోపాటు విద్యుత్తు సమస్యలపై రైతులు కన్నెర్ర చేశారు. యూరియా యాప్‌తో అష్టకష్టాలు పడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని మండిపడ్డారు. కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడంటూ భగ్గుమన్నారు. ఈ సందర్భంగా శనివారం పలుచోట్ల రైతులు ఆందోళనలు చేపట్టారు.

నాగర్‌కర్నూల్‌లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో కలిసి ట్రాక్టర్లతో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. దాదాపు ఏడు కిలోమీటర్ల పొడవునా ర్యాలీ కొనసాగింది. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పాల్గొని సర్కార్ తీరుపై దుమ్మెత్తి పోశారు. స్థానిక బస్‌స్టాండ్ కూడలిలో యూరియా ఖాళీ బస్తాలు కట్టి ఉట్టి కొట్టినట్టు నిరసన తెలిపారు.

యూరియా కోసం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడు చౌరస్తా వద్ద కమ్మర్పల్లి, అచ్చుమాయిపల్లి గ్రామాల రైతులు ధర్నా చేపట్టారు. అదే దారిలో వెళ్తున్న బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వారి ఆందోళనకు మద్దతు తెలిపారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో రోడ్డుపై బైఠాయించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మెంట్రాజ్‌పల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. కరెంట్ సమస్యలపై మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో రైతులు సబ్ స్టేషన్‌ను ముట్టడించారు.

ఈ ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, మాజీ ఎంపీ మాలోత్ కవిత పాల్గొని మద్దతు తెలిపారు. 10 గంటల కరెంట్ కూడా వస్తలేదంటూ రైతులు సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం మాచాపూర్, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోడ్గల్ సబ్‌స్టేషన్‌ను రైతులు ముట్టడించారు.
