మీ టీచర్ల గుంపునకు మేస్త్రీ నేనే. మరో రెండేండ్లలో మీ సమస్యలు పరిష్కరిస్త.. రెండేండ్ల దాకా నన్ను పీఆర్సీ, డీఏలు అడుగొద్దు.. నన్ను పాస్ చేస్తరో.. ఫెయిల్ చేస్తరో మీరే తేల్చుకోవాలే.. ఒక్క సంతకంతో కలెక్టర్లు, ఎస్పీలు ట్రాన్స్ఫర్ అయిపోతరు. కానీ, టీచర్లు తెలివైనోళ్లు.. వాళ్లను ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్న..
– ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ)/కొడంగల్: రాష్ట్రంలో ఉపాధ్యాయులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. తానే టీచర్ల గుంపునకు మేస్త్రీనంటూ వ్యాఖ్యానించారు. కొడంగల్ పర్యటనలో ఉన్న ఆయన శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానోత్సవంలో పా ల్గొన్నారు. ముందుగా సభలో సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సభలో సీఎం మాట్లాడుతూ తనను పాస్ చేస్తారో.. ఫెయిల్ చేస్తరో టీచర్లే తేల్చుకోవాలని కోరారు. మరో రెండేండ్లలో టీచర్ల సమస్యలు పరిష్కరిస్తానంటూ హామీలు గుప్పించారు. రెండేండ్ల వరకు తనను పీఆర్సీ, డీఏలు అడుగొద్దని విజ్ఞప్తి చేశారు.
రెండేండ్లలో తెలంగాణ విద్యావ్యవస్థను దేశానికే దిక్సూచిగా మార్చాలని కోరారు. ఇప్పటికే అనేక సమస్యలు పరిష్కరించానని, మరో రెండేండ్లలో ఆర్థికంగా వెసులుబాటును బట్టి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పనిలో పనిగా టీచర్లను మెచ్చుకోబోయి సివిల్ సర్వెంట్లను అవమానించారు. ఒక్క సంతకంతో కలెక్టర్లు, ఎస్పీలు ట్రాన్స్ఫర్ అయిపోతారని, టీచర్లు తెలివైన వాళ్లు.. వాళ్లను ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నానంటూ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. అనంతరం ఆర్అండ్బీ గెస్ట్ హౌస్, క్రిటికల్ కేర్ యూనిట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, తాండూర్, పరిగి ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, రామ్మెహన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, అరబిందో ఫార్మా ఫౌండేషన్ సీఎస్ఆర్ హెడ్ సదానంద్‌రెడ్డి, అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈసారి గురుపూజోత్సవ కార్యక్రమాన్ని కొడంగల్‌లో నిర్వహించారు. రాష్ట్ర విద్యాశాఖ 123 మంది ఉత్తమ ఉపాధ్యాయులను అవార్డులకు ఎంపిక చేసింది. మరో ముగ్గురు అధికారులకు విశిష్ట సేవా పురసారాలను ప్రకటించింది. దీంతో అవార్డు గ్రహీతలంతా ఎంతో ఆశతో కొడంగల్ చేరుకున్నారు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డు వస్తుందని భావించారు. కానీ 123 మంది అవార్డు గ్రహీతల్లో కేవలం 11 మందికి మాత్రమే సీఎం చేతుల మీదుగా పురసారాలు అందాయి. మరో ముగ్గురు అధికారులకు కూడా సీఎం అవార్డులు అందజేశారు. అనంతరం సీఎం వేదిక దిగడంతో ప్రజాప్రతినిధులు కూడా వెళ్లిపోయారు. మిగిలిన అవార్డు గ్రహీతలకు అధికారుల చేతుల మీదుగానే అవార్డులు అందించాల్సి వచ్చింది. కొడంగల్ దాకా పిలికి కొందరికే అవార్డులివ్వడంపై కొందరు నొచ్చుకున్నారు.