వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపు ధోరణిలో భారత్‌పై టారిఫ్‌ల గురించి మాట్లాడుతూ ఉంటే, భారత్ అందుకు నిశ్శబ్దంగా ప్రతిస్పందించినట్టు తెలుస్తున్నది. అమెరికా నుంచి భారతదేశానికి ఎగుమతి అవుతున్న పప్పు దినుసులపై భారత్ 30 శాతం టారిఫ్ విధించిందని, దీనిని తొలగించేవిధంగా భారత్‌పై ఒత్తిడి తేవాలని అమెరికన్ సెనెటర్లు ఇద్దరు ఇటీవల ట్రంప్‌ను కోరారు. ఈ టారిఫ్ అనుచితమని వీరు పేర్కొన్నారు. నార్త్ డకోటా సెనెటర్ కెవిన్ క్రామర్, మొంటానా సెనెటర్ స్టీవ్ డైనెస్ ఈ లేఖను ట్రంప్‌నకు రాశారు. నిరుడు అక్టోబర్ 30న అమెరికన్ యెల్లో పీస్ (పప్పు)పై భారత్ 30 శాతం టారిఫ్ విధించిందని, అది నిరుడు నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిందని తెలిపారు.
ఈ చర్య ఎవరి దృష్టిలోనూ పడలేదని, ప్రభుత్వం దీనిపై ప్రచారం చేయలేదని పేర్కొన్నారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న సమయంలో, అమెరికన్ పప్పు దినుసులు, అపరాలకు మెరుగైన మార్కెట్ లభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ విశ్లేషకుడు నవరూప్ సింగ్ ఇచ్చిన పోస్ట్‌లో, అమెరికా విధించిన టారిఫ్‌లకు భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటున్నదన్నారు. దిగుమతి చేసుకుంటున్న పప్పు దినుసులపై 30 శాతం టారిఫ్ విధించిందని పేర్కొన్నారు. భారత్ విధించిన టారిఫ్‌పై మీడియా దృష్టి పడలేదు. ట్రంప్ నిరుడు విధించిన 50 శాతం టారిఫ్‌లకు ప్రతీకారంగానే భారత్ ఈ చర్య తీసుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. దీనివల్ల అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం చర్చలను మరింత సంక్లిష్టం చేయవచ్చు.