Grok Ban | ఎలాన్ మస్క్ కంపెనీ ఎక్స్ఏఐ అభివృద్ధి చేసిన ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ను నిషేధించాలని టర్కిష్ కోర్టు ఆదేశించింది. తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌తో పాటు దేశంలోని ప్రముఖ వ్యక్తుల గురించి చాట్‌బాట్ అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో యూజర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంగా అధ్యక్షుడు ఎర్డోగన్, తుర్కియే వ్యవస్థాపకుడు ముస్తఫా కెమాల్ అటాటర్క్ గురించి గ్రోక్ అభ్యంతరకరమైన సమాధానాలు ఇచ్చిందంటూ టర్కిష్ ప్రభుత్వ అనుకూల వార్తా ఛానెల్ ఎ హేబర్ పేర్కొంది. దాంతో టర్కీ ఇంటర్నెట్ చట్టం ప్రకారం.. ముప్పుగా పేర్కొంటూ గ్రోక్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు. కోర్టు బుధవారం పిటిషన్‌ను ఆమోదించింది. నిషేధాన్ని వెంటనే అమలు చేయాలని దేశ టెలికమ్యూనికేషన్ అథారిటీని ఆదేశించింది. అయితే, ఎలాంటి ప్రశ్నలు అడిగినా.. ఈ చాట్‌బోట్ ఎలాంటి ఫిల్టర్ లేకుండా సమాధానాలు ఇస్తుండడం ఇబ్బందికరంగా మారుతున్నది. రాజకీయంగా, సున్నితమైన అంశాల్లో ఫిల్టర్ లేని సమాధానాల కారణంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.