Donald Trump | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఘన విజయం సాధించారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అంటూ ఆయన ఇచ్చిన నినాదానికి అమెరికన్లు ఓట్ల వర్షం కురిపించారు. దీంతో అగ్రరాజ్యానికి 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారు. 538 ఎలక్టోరల్ ఓట్లలో విజయానికి కావాల్సిన 270 ఓట్లను ట్రంప్ సాధించారు. బుధవారం రాత్రి 11 గంటల సమయానికి ట్రంప్‌నకు 294 ఎలక్టోరల్ ఓట్లు దక్కగా, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 223 ఓట్లు సాధించారు. మొత్తంగా ట్రంప్ 71,727,828(50.9 శాతం) ఓట్లు దక్కించుకోగా, కమలా హారిస్ 66,836,253(47.4 శాతం) ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో గెలిచిన ట్రంప్.. సగర్వంగా రెండోసారి శ్వేతసౌధంలోకి అడుగుపెట్టబోతున్నారు.
అయితే, దానికి ఇంకా సమయం ఉంది. అమెరికాలో గెలిచిన అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేయడానికి సుదీర్ఘ సమయం పడుతుంది. ఇంచుమించు 11 వారాల సమయం పడుతుంది. అంటే ఇప్పుడు విజయం సాధించిన వారు వచ్చే ఏడాది జనవరిలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు (sworn in as the US president). తొలుత నవంబర్‌లో ఎన్నికైన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం మార్చి 4వ తేదీన జరిగేది. ఇందు కోసం దాదాపు నాలుగు నెలల సమయం పట్టేది. అమెరికాలో ‘గ్రేట్ డిప్రెషన్’ సందర్భంగా ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నిక నుంచి ప్రమాణ స్వీకారానికి మధ్యలో ఉన్న గ్యాప్‌ను మూడు నెలలకు కుదించారు.
ఇందుకోసం 1933లో సవరణను తీసుకొచ్చారు. దాని ప్రకారం నవంబర్‌లో ఎన్నికైన అధ్యక్షుడు జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారు. దీని వెనుక చాలా కారణాలు ఉంటాయని చెబుతుంటారు. ఎన్నికల నుంచి ప్రమాణస్వీకారం మధ్య సుదీర్ఘ వ్యవధి ఉండటానికి అధికార బదలాయింపులు కూడా ఓ కారణమని అక్కడి అధికారులు పేర్కొన్నారు. కొత్త అధ్యక్షుడు, ఆయన బృందం పాలనకు సిద్ధం కావడానికి ఈ సమయం ఇస్తారని సమాచారం.
2025 జనవరి 3న కొత్తగా ఎన్నికైన కంగ్రెషనల్ రిప్రజెంటేటివ్స్, సెనేటర్స్ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. 2025 జనవరి 6న ఎలక్టొరల్ కాలేజ్ ఓట్లను కాంగ్రెస్ లెక్కిస్తుంది. దీని కోసం కాంగ్రెస్ ప్రత్యేక సంయుక్త సమావేశం జరుగుతుంది. 270 లేదా అంతకన్నా ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని దేశాధ్యక్షునిగా ప్రకటిస్తారు. దేశ ఉపాధ్యక్షునికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. 2025 జనవరి 20న మధ్యాహ్నం దేశాధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారు.
Also Read..
US President | అమెరికా అధ్యక్షుడి జీతం.. ఇతర సౌకర్యాల గురించి తెలుసా..?
Kamala Harris: ట్రంప్ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తాం: కమలా హారిస్
America President | అమెరికా అధ్యక్ష పీఠం.. ఆమెకు అందని ద్రాక్షే!