వాషింగ్టన్: అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు, అధికార మార్పిడికి సహకరించనున్నట్లు కమలా హారిస్ తెలిపారు. డెమోక్రటిక్ అభ్యర్థిగా పోరాడి ఓడిన కమలా హారిస్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అమెరికా ఆశాజ్యోతి దివ్యంగా వెలుగుతుందని ఉపాధ్యక్షురాలు హారిస్ తెలిపారు. అధికార మార్పిడి శాంతియుతంగా జరిగేందుకు ట్రంప్‌నకు సహకరించనున్నట్లు ఆమె వెల్లడించారు. హోవర్డ్ యూనవర్సిటీలో ఆమె తన మద్దతుదారులతో భావోద్వేగంగా మాట్లాడారు. ఫలితాలను ఆమోదించాలని ఆమె అభిమానులను కోరారు. దేశ ఆదర్శాలను రక్షించేందుకు పోరాడాలన్నారు. తన మనసు సంతోషంతో నిండి ఉన్నదని, మీరు నాపై చూపిన నమ్మకానికి కృతజ్ఞతతో ఉన్నట్లు ఆమె తెలిపారు. విజయం సాధించిన ట్రంప్‌తో మాట్లాడానని, ఆయనకు కంగ్రాట్స్ చెప్పినట్లు ఆమె వెల్లడించారు. ట్రంప్‌కు, ఆయన టీమ్‌కు హెల్ప్ చేస్తానని చెప్పానని, శాంతియుతంగా అధికారాన్ని బదలాయిస్తామన్నారు.