(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొంటున్న నిర్ణయాలు ట్రేడ్ వార్‌కు దారితీస్తున్నది. కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం సుంకాలు ఉంటాయని ఇదివరకే ప్రకటించిన ట్రంప్.. తాజాగా డ్రాగన్ దేశం చైనాకు కూడా గట్టి షాక్ ఇచ్చారు. ఇప్పటికే చైనా ఉత్పత్తులపై 10 శాతం సుంకాలు విధించిన ఆయన.. తాజాగా దాన్ని 20 శాతానికి పెంచారు. ఈ మేరకు కార్యనిర్వహణ ఉత్తర్వులపై ట్రంప్ సంతకాలు చేశారు. ఫెంటనిల్ డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో చైనా విఫలమవ్వడం వల్లే టారిఫ్‌లను రెట్టింపు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇక, కెనడా, మెక్సికో దిగుమతులపై గతంలో ప్రకటించిన 25 శాతం సుంకాల నిర్ణయంపై ఎలాంటి మార్పులేదని ట్రంప్ తేల్చిచెప్పారు. మార్చి 4 (అమెరికా కాలమానం ప్రకారం..) నుంచి ఈ టారిఫ్‌లు అమల్లోకి వస్తాయన్నారు. ఫెంటనిల్ డ్రగ్స్, అక్రమ వలసదారులను నియంత్రించడంలో మెక్సికో, కెనడా ఫెయిలైయ్యాయన్న ట్రంప్.. తన తాజా నిర్ణయంతో అమెరికాకు కంపెనీలు, పరిశ్రమలు క్యూ కడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అమెరికా టారిఫ్ ప్రకటనలపై చైనా, కెనడా తీవ్రంగా స్పందించాయి. తాము కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాల మోత మోగిస్తున్నట్టు ప్రకటించాయి. అమెరికా నుంచి దిగుమతి చేసుకొంటున్న వస్తువులపై 10 శాతం నుంచి 15 శాతం సుంకాలు విధిస్తున్నట్టు చైనా ప్రకటించింది. సోయాబీన్, పోర్క్, డెయిరీ ఉత్పత్తులు, బీఫ్, చేపలు, పండ్లు, కూరగాయలు తదితర వస్తువులపై 10 శాతం, చికెన్, గోధుమ, మక్కజొన్న, పత్తి తదితరాలపై 15 శాతం సుంకాలు విధిస్తున్నట్టు డ్రాగన్ పేర్కొంది. మార్చి 10వ తేదీ నుంచి ఈ టారిఫ్ రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. అమెరికా చర్యలను ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వేదికగా ఎండగడతామన్న చైనా.. న్యాయపరమైన చర్యలను తీసుకోనున్నట్టు హెచ్చరించింది. ఇక, అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే ఆల్కహాల్, పండ్లు వంటి 155 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు కెనడా ప్రకటించింది. మంగళవారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్టు వెల్లడించింది. అమెరికాపై ప్రతీకార సుంకాలు విధిస్తామని మెక్సికో కూడా తాజాగా ప్రకటించింది.
ట్రంప్ టారిఫ్ నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆసియా మార్కెట్లు గత కొన్నిరోజులుగా తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం, మధ్యప్రాచ్యంలో అనిశ్చితి, వాతావరణ మార్పులు, ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్‌లు ఒకవైపు కొనసాగుతుండగా ఇంకోవైపు ప్రపంచ దేశాలపై ట్రంప్ ట్రేడ్ వార్‌కు దిగుతుండటంతో మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. జపాన్‌కు చెందిన నిక్కీ, హాంకాంగ్‌లోని హాంగ్‌సెంగ్, ఆస్ట్రేలియాలోని ఏఎస్ఎక్స్ సహా దేశంలోని సెన్సెక్స్ సూచీలు పడిపోయి గత కొన్ని రోజులుగా మదుపర్లు లక్షల కోట్ల సంపదను కోల్పోతుండటం తెలిసిందే. ట్రంప్ టారిఫ్ ప్రకటనలతో అమెరికాలోని ఎస్ అండ్ పీ సూచీలు కూడా ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి.
ట్రంప్ మొదలుపెట్టిన ట్రేడ్ వార్ ప్రమాదకరమైందని అమెరికాకు చెందిన దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ నిర్ణయాలు దుందుడుకు చర్యలుగా అభివర్ణించారు. సుంకాలు విధించడం ఓ విధంగా యుద్ధ చర్యలేనన్న బఫెట్.. ట్రంప్ చర్యలతో 918 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై ప్రభావం పడొచ్చని పేర్కొన్నారు.