వాషింగ్టన్, సెప్టెంబర్ 8 : రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ఇదివరకే భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాపై రెండవ దశ ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. సోమవారం వైట్ హౌస్ వెలుపల రష్యాపై మరిన్ని జరిమానాలు విధించడానికి మీరు సిద్ధమా అని విలేకరులు ప్రశ్నించగా, అవును..నేను సిద్ధం అని ట్రంప్ జవాబిచ్చారు. కాగా, అంతకుముందు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ మాట్లాడుతూ రష్యన్ చమురు కొనుగోలుదారులపై కఠినమైన జరిమానాలు విధించడం వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థ కూలిపోగలదని వ్యాఖ్యానించారు.
ఎన్బీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ దెర్ లేయెన్‌తో ఫలప్రదమైన చర్చలు జరిపారని బెస్సెంట్ చెప్పారు. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు యూరోపియన్ యూనియన్ తీసుకోవలసిన చర్యల గురించి శుక్రవారం ఆమె తనతో ఫోన్లో మాట్లాడినట్లు ఆయన చెప్పారు. కాగా, అంతకుముందే 25 శాతం ప్రతీకార సుంకాలు భారత్‌పై విధించిన ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు మరో 25 శాతం సుంకాన్ని జరిమానాగా విధించారు.