Trump Tariffs | గ్రీన్‌లాండ్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పట్టుబట్టారు. ఈ విషయంలో తమను సమర్థించని దేశాలపై ట్రంప్ కక్ష సాధింపు చర్యలకు దిగారు. గ్రీన్‌లాండ్‌పై అమెరికా నియంత్రణకు వ్యతిరేకిస్తున్న 8 దేశాలపై భారీగా సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. డెన్మార్క్, బ్రిటన్, ఫ్రాన్స్, నార్వే, స్వీడన్, జర్మనీ, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాల ఉత్పత్తులపై 10 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇవి అమలులోకి వస్తాయని వెల్లడించారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతా ద్వారా హెచ్చరించారు.
గ్రీన్లాండ్ కొనుగోలు వ్యవహారంలో సహకరించకపోయినా.. జూన్ 1వ తేదీ నాటికి కొనుగోలు ఒప్పందం పూర్తి కాకపోయినా ఈ 8 దేశాలపై టారిఫ్‌ను 25 శాతానికి పెంచుతామని ట్రంప్ హెచ్చరించారు. డెన్మార్క్ రాజ్యంలో భాగంగా పాక్షిక స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్న గ్రీన్లాండ్ తమ సొంతం కావడం తప్ప, మరేమీ తమకు సమ్మతం కాదని ట్రంప్ చెబుతూనే ఉన్నారు. దేశ భద్రత కోసం గ్రీన్లాండ్ తమకు కావాలని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమతో ఏకీభవించని దేశాలపై ట్రంప్ సుంకాల పేరుతో వార్నింగ్ ఇస్తున్నారు.
ట్రంప్ ఏకపక్ష నిర్ణయంపై యూరప్ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. మిత్ర దేశాలపై టారిఫ్‌లు విధించడం తప్పు అని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. ఈ బెదిరింపులు ఆమోదయోగ్యం కావని.. యూరప్ దేశాలన్నీ ఐక్యంగా దీనికి స్పందిస్తాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ స్పష్టం చేశారు.