న్యూఢిల్లీ: ఇరాన్‌పై దాడుల్ని 5 రోజుల పాటు అమెరికా నిలిపివేసిన విషయం తెలిసిందే. సంక్షోభం() నేపథ్యంలో ఆ దేశంతో చర్చలు నిర్వహిస్తున్న అమెరికా ఓ కొత్త ప్లాన్ వేసింది. 15 పాయింట్లతో పీస్ ప్లాన్‌ను ట్రంప్ ప్రతిపాదించారు. శాంతి కోసం ఆ ప్రతిపాదనలు అమలు చేయాలని ట్రంప్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆ 15 పాయింట్ పీస్ ప్లాన్‌లో ఏముందో తెలుసుకుందాం. నటాంజ్, ఇస్పాహన్, ఫొర్డోలో ఉన్న అణు కేంద్రాలను పూర్తి ధ్వంసం చేయాలి, వాటిని మళ్లీ వాడరాదు. ఇరాన్లో జరిగే అణు కార్యక్రమాలపై అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ నిఘా ఉండాలి. పారదర్శకంగా ఆ పని జరగాలన్నారు. ప్రాంతీయ విచ్చిన్నకర శక్తులకు ఇరాన్ ఫండింగ్ ఆపాలన్నారు. ఇప్పటి వరకు సేకరించిన న్యూక్లియర్ సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలన్నారు.
అణ్వాయుధాల తయారీ కోసం మళ్లీ ప్రయత్నించవద్దు. ఇరాన్ నేలపై యురేనియం శుద్దీకరణ జరగరాదు. ఇప్పటికే శుద్ది కాబడిన మెటీరియల్‌ను ఐఏఈఏకు అప్పగించాలన్నారు. హోర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలని, ఫ్రీ మారిటైం జోన్‌గా ప్రకటించాలని ట్రంప్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇరాన్ క్షిపణుల అంశంలో ఆంక్షలు ఉంటాయని, వాటి సంఖ్య, రేంజ్‌పై తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. కేవలం ఆత్మరక్షణకే ఆ ఆయుధాలు వాడాలన్నారు. 15 పాయింట్ పీస్ ప్లాన్ ప్రకారం విద్యుత్తు ఉత్పత్తి కోసం బుషెహర్ న్యూక్లియర్ ప్రాజెక్టును అమెరికా సహకారంతో డెవలప్ చేయాలి. ఇరాన్‌పై అన్ని ఆంక్షలు ఎత్తివేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రతిపాదనలపై ఇప్పటి వరకు వైట్‌హౌజ్ అధికారిక ప్రకటన చేయలేదు. కేవలం మీడియాలో మాత్రమే పీస్ ప్లాన్ గురించి వివరాలు వెల్లడవుతున్నాయి.
మరో వైపు ట్రంప్ చేసిన ప్రతిపాదనలను ఇరాన్ వ్యతిరేకించింది. ఆ దేశ మిలిటరీ కమాండ్ ఖాటమ్ అల్ అన్బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ ప్రతినిధి ఇబ్రహిం జోల్ఫాగరి దీనిపై మాట్లాడారు. మీ ఓటమిని ఒప్పందంగా భావించరాదు అని పేర్కొన్నారు. మీ ప్రభుత్వంలోనే అంతర్గత సమస్యలు ఉన్నాయని, మీతే మీరే చర్చలు జరుపుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇక ఇక్కడ మీ పెట్టబడులు ఉండబోవని, గతంలో లాంటి ఇంధన ధరలను మళ్లీ చూడబోరన్నారు. ఈ ప్రాంతంలో స్థిరత్వం మా సైనిక శక్తితోనే వస్తుందన్నారు. మా లాంటి వాళ్లతో మీలాంటి వాళ్లు ఎన్నటికీ పోటీ పడలేరన్నారు.