శ్రీ శుభకర యుగాదిగా సిరులు దెచ్చి
కటుకరోనా బ్రతుకులెల్ల క్రాంతి జూడ
నవ వసంత రాగాలతో నాట్యమాడ
తెలుగు యిండ్లకు రావమ్మ వెలుగులీయ!
చితికిన బతుకు వారికి చివురులిచ్చి
శిశిర రాల్చిన కొమ్మల చిగురులిచ్చి
మనుషులందరికి మమతమంచి నిచ్చి
శ్రీప్లవయుగాది గారమ్ము శివము నిచ్చి!
పాట కిన్నెరసానిలా పల్లవించ
మాట విశ్వంభర జనుల బాటసాగ
తెలుగు ఆత్మవై పరమాత్మ వెలయురీతి
పూవు పూవుల రావమ్మ పుడమి మురియ!
వరలు ఓరుగల్లు అమరావతులు వెలుగ
తెలుగు హద్దులు వేరైన తేజమొకటె
తెలుగు వారెక్కడున్నను వెలుగు వారె
అనుచు రావమ్మ మాయిండ్ల హాయిగొల్ప!
చిరము శ్రీశైలమల్లన్న సిరులు యివ్వ
భక్ష వాటికా బీమన్న దయను జూప
భవుడు కాళేశ్వరుడుసదా భాగ్యమొసగ
మన తెలుగు దేశపు యుగాది మహితకాగ!
నన్నయ కృతులు నీలోన వన్నెలొలుక
తిక్కన నుడులునీలోన తేనొలొలుక
పోతన పలుకులో నీలోన పూతలలది
తెలగనార్యుని తెలుగులు తేజమీయ!
శాతవాహన రాజుల శౌర్యరీతి
వేంగి చాళుక్యచోళుల విజయగీతి
కాకతీయుల ఘనకీర్తి కదనరీతి
తెలుగువారల చరితలు వెలుగురీతి!
నీదు హొయల లయలతోడ నెనరు జూపి
మనదు సంస్కృతులందున మహితనేర్పి
విశ్వశాంతితో జనులెల్ల విరియురీతి
గడప గడపకు రావమ్మ కమ్రరీతి!
-రాఘవ మాస్టారు (బెంగళూరు),09741407099