Donald Trump : అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తమ ప్రభుత్వంలోనే ఒక గూఢచారి ఉన్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ (Iran) లో కూలిపోయిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ పైలట్‌ను కాపాడేందుకు యూఎస్ సైన్యం భారీ ఆపరేషన్ నిర్వహించింది. అయితే ఆ ఆపరేషన్ వివరాలను గూఢచారి (Spy) లీక్ చేశాడని ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తన సైన్యం నిర్వహించిన ఆపరేషన్ గురించి ట్రంప్ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎఫ్-15ఈ విమానం కూలిన తర్వాత ఒక పైలట్‌ను అమెరికా బలగాలు రక్షించాయని చెప్పారు.
అయితే రెండో పైలట్ కోసం బలగాలు ఇంకా గాలిస్తున్నాయని ఓ వార్తాసంస్థ రాసిన కథనంతో ఇరాన్ (Iran) కు ఆ విషయం తెలిసిందని ట్రంప్ అన్నారు. దాంతో ఆపరేషన్ క్లిష్టతరమైందని చెప్పారు. వార్త రాసిన జర్నలిస్టుకు ఆ సమాచారం ఎక్కడినుంచి వచ్చిందో వెల్లడించాలని ఆర్డర్ వేశారు. లేదంటే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సివస్తుందని హెచ్చరించారు. సమాచారం ఎవరిచ్చారో జర్నలిస్టు చెప్పకపోతే.. జైలుకి వెళ్లాల్సివస్తుందని బెదిరించారు. అయితే ఆ జర్నలిస్టు పేరుగానీ, ఆ వార్త సంస్థ పేరుగానీ ట్రంప్ బయటపెట్టలేదు.
లీక్‌కు కారణమైన వ్యక్తిని కనిపెట్టేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని ట్రంప్ చెప్పారు. అమెరికా దళాలు రెండో పైలట్ కోసం గాలిస్తున్నాయని వార్త ప్రచురితమైన తర్వాతే.. ఇరాన్ అప్రమత్తమైందన్నారు. ఆ పైలట్‌ను పట్టుకున్నవారికి భారీగా బహుమతి అందజేస్తామని ఆ దేశం బహిరంగ ప్రకటన జారీ చేసిందని, దాంతో తమ సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని తెలిపారు. గూఢచర్యానికి పాల్పడిన వ్యక్తిని మానసిక రోగిగా ట్రంప్ అభివర్ణించారు. అతడిని కనిపెట్టితీరాలని, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు.
ఎఫ్-15ఈ కూలడంతో గల్లంతైన పైలట్‌ను రక్షించేందుకు నిర్వహించిన ఆపరేషన్ వివరాలను ట్రంప్ మీడియాకు వెల్లడించారు. 155 విమానాలు ఆపరేషన్‌లో పాల్గొన్నాయని చెప్పారు. వాటిలో నాలుగు బాంబర్లు, 64 ఫైటర్లు, 48 రీఫ్యూయలింగ్ విమానాలు, 13 రెస్క్యూ విమానాలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.