Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చైనాపై మరోసారి విమర్శలు చేశారు. ఆ దేశం అమెరికాలో తన సైన్యాన్ని నిర్మిస్తోందని ఆరోపించారు. చైనా (China) నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై రచ్చ జరుగుతోంది.
‘మిలిటరీ ఏజ్’లో ఉన్న ఆ దేశ పౌరులు ఓ సైన్యంగా మారేందుకు అమెరికాకు వస్తున్నారని, వాళ్లు సైన్యంగా మారి దాడిచేస్తారని పుతిన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ‘చైనా నుంచి భారీ సంఖ్యలో పౌరులు వస్తున్నారు. వారిదంతా సైన్యం వయసే. అందులోనూ పురుషులే అధికం. వారిని చూస్తుంటే మన దేశంలో చిన్న సైన్యాన్ని నిర్మించేందుకు యత్నిస్తున్నారా..? అనిపిస్తోంది. వారి ప్రయత్నం కూడా అదేనా..?’ అని పెన్సిల్వేనియాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ వ్యాఖ్యానించారు.
కాగా, కొవిడ్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత చైనా నుంచి అమెరికాకు అక్రమ వలసలు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. దక్షిణ అమెరికాకు విమానాల్లో చేరుకొని.. అక్కడి నుంచి ప్రమాదకరమైన మార్గాల్లో, కాలినడకన ఉత్తర అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నట్లు సమాచారం. 2023 లోనే అమెరికా-మెక్సికో సరిహద్దులో 37 వేల మంది చైనీయులను అరెస్టు చేసినట్లు సమాచారం. 2022తో పోలిస్తే ఇది 10 రెట్లు ఎక్కువ. గత డిసెంబర్లోనే అక్రమంగా ప్రవేశిస్తోన్న 5,951 మందిని యూఎస్ అధికారులు అరెస్టు చేశారు.
అమెరికాలోకి చైనీయుల అక్రమ ప్రవేశాలు గణనీయంగా పెరిగినట్లు ట్రంప్‌తో పాటు రిపబ్లికన్ నేతలు భావిస్తున్నారు. దాంతో భౌగోళికంగా, రాజకీయపరంగా ముప్పు ఉందని ఆందోళన చెందుతున్నారు. అయితే, కొవిడ్ సమయంలో డ్రాగన్ కఠిన ఆంక్షలవల్ల కలిగిన ఆర్థికనష్టం నుంచి, పేదరికం నుంచి తప్పించుకునేందుకే తాము అమెరికాకు వచ్చినట్లు చైనా వలసవాదులు కొందరు చెబుతున్నారు. ఇక్కడ కూడా తమ జీవితాలు తాము ఊహించినట్లు లేవని, చాలా కష్టపడాల్సి వస్తోందని వాపోయారు.
ట్రంప్ ప్రసంగాలు చైనాతోపాటు ఇతర ఆసియా దేశాల పౌరులపై ద్వేషాన్ని పెంచుతాయని, చైనీయులపై ద్వేషానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సింథియా చోయ్ అన్నారు. అనేక మంది ఆసియన్ అమెరికన్లలో భయం నెలకొందని, ప్రజారవాణా వ్యవస్థను ఉపయోగించేందుకు వెనకాడుతున్నారని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఏసియన్ పసిఫిక్ అమెరికన్స్ డైరెక్టర్ గ్రెగ్ ఓర్టాన్ అభిప్రాయపడ్డారు.