వాషింగ్టన్ : అమెరికా-భారత్‌ల మధ్య వాణిజ్యం ఒక పక్షానికి విపత్తుగా పరిణమించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం వ్యాఖ్యానించారు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులపై ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్‌లపై ఆగ్రహం వ్యక్తమవుతుండటం, ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో అమెరికా చాలా తక్కువ వ్యాపారం చేస్తున్నదని, భారత్ అమెరికాతో చాలా ఎక్కువ వ్యాపారం చేస్తున్నదని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసునని ట్రంప్ పేర్కొన్నారు. భారత్ పెద్ద ఎత్తున వస్తువులను తన అతి పెద్ద క్లయింట్ అయిన అమెరికాకు అమ్ముతున్నదన్నారు. కానీ అమెరికా మాత్రం భారత్‌కు చాలా తక్కువ వస్తువులనే అమ్ముతున్నదన్నారు. ఈ పరిస్థితి ఇప్పటి వరకు పూర్తిగా ఒక పక్షం కోరుకుంటున్న సంబంధంగానే ఉందని తెలిపారు.
అనేక దశాబ్దాలుగా ఇలాగే జరుగుతున్నదని చెప్పారు. దీనికి కారణాన్ని వివరిస్తూ, భారత్ ఇప్పటి వరకు ఏ దేశం విధించనంత ఎక్కువగా అమెరికా వ్యాపారాలపై టారిఫ్‌లను విధిస్తున్నదన్నారు. అందువల్ల భారత్‌లో అమెరికా వ్యాపార సంస్థలు తమ వస్తువులను అమ్ముకోలేకపోతున్నాయని తెలిపారు. ఇది పూర్తిగా ఒక పక్షానికి విపత్తుగా పరిణమించిందని చెప్పారు. అంతేకాకుండా, భారత్ అత్యధిక చమురు, మిలిటరీ ఉత్పత్తులను రష్యా నుంచి కొంటున్నదని, అమెరికా నుంచి చాలా తక్కువగా కొంటున్నదని పేర్కొన్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారత్ తన టారిఫ్‌లను సున్నా స్థాయికి తగ్గిస్తానని చెప్పిందన్నారు. అయితే, ఆ పనిని కొన్ని సంవత్సరాల క్రితమే చేసి ఉండవలసిందని, ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని చెప్పారు.