H1-B | వాషింగ్టన్, సెప్టెంబర్ 23: హెచ్-1బీ వీసా ఫీజును 1 లక్ష డాలర్లకు(రూ. 88 లక్షలు) పెంచిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో మార్పులు తీసుకురానున్నట్లు ప్రకటించింది. అభ్యర్థుల ఎంపిక కోసం ప్రస్తుతం నిర్వహిస్తున్న లాటరీ విధానంలో మార్పులు తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఎక్కువ నైపుణ్యం ఉన్న వారికి, అధిక వేతనాన్ని పొందేవారికి ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నట్లు ప్రభుత్వం మంగళవారం తెలిపింది.
హెచ్-1బీ ఎంపిక కోసం ప్రస్తుతం నిర్వహిస్తున్న లాటరీ విధానాన్ని పక్కనపెట్టి అధిక నైపుణ్యం గల దరఖాస్తుదారులను వీసాలకు ఎంపిక చేయాలని హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ (డిహెచ్ఎస్) భావిస్తోంది. అధిక నైపుణ్యం, ఎక్కువ జీతం ఉన్న విదేశీ కార్మికులకే హెచ్-1బీ వీసాలు జారీచేయాలని డీహెచ్ఎస్ ఆలోచిస్తోంది. నైపుణ్యానికి తగ్గట్టుగా వేతనం అన్న తరహాలో వేజ్ లెవల్ 1 నుంచి వేజ్ లెవల్ 4 వరకు నాలుగు విభాగాలుగా విడగొట్టి ప్రాధాన్యతా క్రమంలో వీసాలు జారీచేయాలన్నది ప్రభుత్వ ప్రతిపాదన. ఉదాహరణకు వేజ్ లెవల్ 4లో ఉన్న అభ్యర్థి పేరు నాలుగు విభాగాలలోనూ ఉంటుంది. అదే వేజ్ లెవల్ 1లో ఉన్న అభ్యర్థి పేరు ఒకటే విభాగంలో ఉంటుంది.
ట్రంప్ ప్రభుత్వం కొత్తగా పెంచిన హెచ్-1బీ వీసాల ఫీజు కారణంగా ప్రత్యామ్నాయ మార్గాలపై టెక్ కంపెనీలు దృష్టిసారించాయి. హెచ్-1బీతో పోలిస్తే మరింత తక్కువ ధరకు అందుబాటులో ఉన్న ఎల్1(అంతర్ కంపెనీ బదిలీలు), ఓ1(అసాధారణ నైపుణ్యాలు) వీసా క్యాటగిరీలకు ఇక డిమాండు పెరిగే అవకాశం ఉందని అవి అంచనా వేస్తున్నాయి. ఓ1, ఎల్1 క్యాటగిరీలకు అత్యంత కఠినమైన అర్హతా నిబంధనలు ఉండడమేగాక ఇవి హెచ్-1బీ వీసాలను పూర్తిగా భర్తీచేయలేవు. అయితే కంపెనీలు మారిన పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చి కొత్త ఉద్యోగ నియామకాలలో ఈ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునే అవకాశం అధికంగా ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఉదాహరణకు, ఓ1 క్యాటగిరీనే తీసుకుంటే ఏడాదికి సగటున 12,000 డాలర్ల(రూ. 10.64 లక్షలు) ఫీజు ఉండగా హెచ్-1బీ వీసా ఫీజులో ఇది ఎనిమిదవ వంతు మాత్రమే. హెచ్-1బీ వీసాలను గరిష్ఠంగా 85,000 మాత్రమే కేటాయిస్తుండగా తిరస్కరణ రేటు 73 శాతం ఉంది. అంతేగాక ఓ1 వీసాలకు లాటరీ పద్ధతి లేదు. కేవలం నైపుణ్యం ఆధారంగానే జారీచేస్తారు. దీనివల్ల యాజమాన్యాలకు డబ్బు ఆదా కావడమేగాక తాము నిపుణులమని రుజువు చేసుకున్న వారికి మాత్రమే అవి దరఖాస్తులు దాఖలు చేయగలవు. అంతేగాక హెచ్-1బీ మాదిరిగా కాకుండా వీసా గడువును 6 సంవత్సరాలకు మించి పొడిగించుకునే అవకాశం దీంట్లో ఉంటుంది. ఓ1 వీసాలు కంపెనీల విశ్వసనీయతను పెంపొందించడమే గాకుండా ఈబీ-1ఏ గ్రీన్‌కార్డుకు మెట్టుగా ఉపయోగపడుతుందని అమెరికాకు చెందిన ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ జినీ గ్రీన్ కార్డు వ్యవస్థాపకుడు సాహిల్ న్యాతి తెలిపారు.
ఎల్1 విషయానికి వస్తే ఇది పూర్తిగా యాజమాన్యం పరిధిలో ఉండే క్యాటగిరీ. దీని ఫీజు ఏడాదికి 7,000 డాలర్లు (రూ. 6.21 లక్షలు) ఉంటుంది. ఇది హెచ్-1బీ ఫీజులో కేవలం 10వ వంతు మాత్రమే. 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఆమోదించిన అన్ని ఎల్1 దరఖాస్తులలో 26 శాతం (71,799) భారతీయులవే కావడం విశేషం. అదే ఆర్థిక సంవత్సరంలో ఓ1 క్యాటగిరీ కింద మొత్తం 19,457 వీసాలు జారీ కాగా భారతీయులు 8 శాతం మంది ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ రెండు క్యాటగిరీలు హెచ్-1బీకి ప్రత్యక్షంగా ప్రత్యామ్నాయం కాబోవని సింఘానియా అండ్ కో మేనేజింగ్ పార్ట్నర్ రోహిత్ జైన్ తెలిపారు. ఎల్1 వీసాకు అర్హత సాధించాలంటే ఓ కంపెనీకి చెందిన అంతర్జాతీయ శాఖలో కనీసం మూడేళ్లు పనిచేసి ఉండాల్సి ఉంటుంది. ఓ1కి తమకు అసాధారణ ప్రతిభ ఉన్నట్లు అభ్యర్థి నిరూపించుకోవలసి ఉంటుంది. ఈ పరిమితులు ఉన్నప్పటికీ పెరిగిన హెచ్-1బీ ఫీజు కారణంగా పడే ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకుంటే కంపెనీలు ఈ రెండు ప్రత్యామ్నాయాలపైనే దృష్టి సారించాల్సి ఉంటుందని జైన్ చెప్పారు.