Cancer | జగ్రెబ్: క్యాన్సర్ వ్యాధిపై కొంతమంది సైంటిస్టులు రోగులను స్వీయ పరిశోధన వైపు మరలించటం సంచలనం రేపుతున్నది. క్రొయేషియాలో స్టేజ్-3 స్థాయిలో ఉన్న రొమ్ము క్యాన్సర్‌ను నయం చేసేందుకు అనుసరించిన పద్ధతులపై వైద్య లోకం అభ్యంతరం వ్యక్తం చేసింది. ల్యాబ్‌లో పెరిగిన వైరస్‌తో రొమ్ము క్యాన్సర్‌ను నయం చేయటాన్ని వైద్య నిపుణులు తప్పుబట్టారు. ఇది అనైతికమంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు.
క్రొయేషియాకు చెందిన 49 ఏండ్ల బీటా హాలస్సీ రొమ్ము క్యాన్సర్ బారినపడగా, ఆమె ఎడమ రొమ్మును వైద్యులు తొలగించారు. రెండోసారి అదే స్థానంలో క్యాన్సర్ కణతులు ఏర్పడటంతో ‘ఆంకోలిక్టిక్ వైరోథెరపీ’గా పిలిచే ‘ఓవీటీ’ చికిత్సను తనకు తానుగా హాలస్సీ ఎంచుకుంది. దీని ద్వారా ఆమె క్యాన్సర్ నుంచి కోలుకుందని ఓ జర్నల్ కథనం వెలువరించింది. అయితే ఈ విధానం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.