Israel | జెరూసలేం: ఇజ్రాయెల్.. ఏడాది కాలంగా ప్రపంచమంతటా మీడియాలో ప్రధాన శీర్షికల్లో నిలిచిన దేశం. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు వైశాల్యంలో అతి చిన్న దేశమైనప్పటికీ.. తన అస్థిత్వం కోసం 75 ఏండ్లుగా పోరాటం చేస్తున్నది. ఇప్పటిదాకా కొన్ని యుద్ధాలను ఎదుర్కొంది. అయితే దాని ఉనికిని కొన్ని అరబ్ దేశాలు నేటికీ గుర్తించడం లేదు. కానీ సాంకేతిక సాయంతో, అమెరికా అండదండలతో అభివృద్ధిని సాధించింది. ఇరాన్ మినహా దాదాపు తన చుట్టూ ఉన్న అన్ని దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకుంది. కానీ ఇరాన్ ప్రోద్బలంతో హమస్, హెజ్బొల్లా, ఇరాక్, సిరియాలోని ఉగ్ర సంస్థలు, హౌతీ తిరుగుబాటుదారులు మాత్రం నిత్యం ఇజ్రాయెల్‌తో ఘర్షణకు దిగుతున్నాయి. గత ఏడాది అక్టోబర్ 7న హమస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడికి పాల్పడటంతో పశ్చిమాసియాలో మొదలైన హింస.. ఈ నెల ఒకటిన ఇజ్రాయెల్‌పైకి ఇరాన్ 200 వరకు ఖండాంతర క్షిపణులను ప్రయోగించడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారిపోయాయి.
‘నేడు అరబ్బులు తమ ఆయుధాలు విసర్జిస్తే.. హింస అంతమవుతుంది. ఒకవేళ యూదులు (ఇజ్రాయెల్) తమ ఆయుధాలను విసర్జిస్తే.. ఇజ్రాయెల్ దేశమే లేకుండా పోతుంది’ అని 1970 దశకంలో ఇజ్రాయెల్ ప్రధాని గోల్డా మెయిర్ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు తుర్కియే తరువాత ఇజ్రాయెల్‌ను గుర్తించిన రెండో ముస్లిం దేశం ఇరాన్. కానీ నేడు అది ఇజ్రాయెల్ బద్ధశత్రువుగా మారిపోయింది. దాని ప్రోద్బలంతోనే నేడు లెబనాన్‌లోని హెజ్బొల్లా, ఇరాక్, సిరియాల్లోని ఉగ్రవాదులు, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు నిత్యం ఇజ్రాయెల్‌పై కాలు దువ్వుతూనే ఉన్నారు. వీటికి తోడు పక్కలో బల్లెంలా పాలస్తీనాలోని హమాస్ అవకాశం దొరికినప్పుడల్లా ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతూనే ఉన్నది. శత్రువులను బలహీనపరచడం ద్వారా, మరికొందరు శత్రువులను స్నేహితులుగా మార్చుకోవడం ద్వారా ఇజ్రాయెల్ తన మనుగడ సాగిస్తున్నది. అమెరికా మద్దతు, తన సైనిక బలం, నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం, పటిష్ఠమైన గూఢచార వ్యవస్థ, నిఘా విభాగం, బలమైన ఆర్థిక వ్యవస్థ ఇజ్రాయెల్‌కు అత్యంత కీలకమైనవి. ఇక ఇజ్రాయెల్ పౌరులు మెరికల్లాంటివారు. ప్రతి ఒక్కరు క్రావ్ మాగా అనే యుద్ధ విద్యలో నైపుణ్యం పొంది ఉంటారు.
ఇజ్రాయెల్ జనాభా 90 లక్షలు మాత్రమే. దేశంలో అత్యధిక భాగం ఎందుకూ పనికిరాని ఎడారి ప్రాంతమే. సముద్రపు జలాలను మంచినీరుగా మార్చే సాంకేతికత, తుంపర సాగుతో బీడు భూములను సాగుకు యోగ్యమైనవిగా మార్చేశారు. ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ సాంకేతికతను అందిస్తున్న కంపెనీల్లో 40శాతం ఇజ్రాయెల్‌కు చెందినవే ఉన్నాయి. తనకున్న ఇంజినీరింగ్ నైపుణ్యంతో ముడిసరుకు, ఇంధన వనరులు, చిన్న మార్కెట్లు వంటి అన్ని సవాళ్లను ఇజ్రాయెల్ ఎదుర్కోగలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలను ఎగుమతి చేస్తున్న 10 టాప్ దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి.
ఇజ్రాయెల్ ఏర్పడిన నాటి నుంచి దానికి అమెరికా బలమైన మద్దతుదారుగా ఉన్నది. తనపై ఒకేసారి వందల సంఖ్యలో రాకెట్లు, క్షిపణుల వర్షం పడినాసరే విజయవంతంగా తిప్పికొట్టగల ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను కూడా అది అమెరికా సాయంతోనే తయారు చేసుకున్నది. అమెరికా ఏటా 3.8 లక్షల కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయాన్ని ఇజ్రాయెల్‌కు అందిస్తున్నది. ఈ నెల ఒకటిన ఇరాన్ క్షిపణుల దాడులను అడ్డుకోవడంలో అమెరికా సాయమందించింది.