james Cameron | అట్లాంటిక్ మహా సముద్రంలో 13 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి గల్లంతైన టైటాన్ సబ్మెర్సిబుల్ (Titan submersible) కథ విషాదాంతమైంది. తీవ్రమైన ఒత్తిడి వల్ల (Catastrophic Implosion) టైటాన్ పేలిపోయిందని, దీంతో అందులో ఉన్న ఐదుగురు పర్యాటకులు మరణించారని అమెరికన్ కోస్ట్‌గార్డ్ (US Coast Guard) ప్రకటించింది. రిమోట్ కంట్రోల్డ్ వెహికల్ సాయంతో మినీ జలాంతర్గామి శకలాలను గుర్తించామని తెలిపింది. ఈ ఘటనపై హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ (james Cameron) విచారం వ్యక్తం చేశారు.
సాహసాలకు, ప్రయోగాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన కామెరూన్.. టైటానిక్ మునిగిన ప్రాంతాన్ని ఇప్పటివరకు 33 సార్లు సందర్శించాడు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని ఆయన ‘ఈ భూమ్మీద అత్యంత క్రూరమైన ప్రదేశాల్లో ఇది ఒకటి’ అని అనేక సందర్బాల్లో చెప్పారు. తాజా ఘటనపై ఆయన స్పందిస్తూ..‘టైటానిక్ షిప్ ప్రమాదం జరిగిన చోట ఆ తరహా ప్రమాదం మళ్లీ జరగడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది’ అని అన్నారు.
ఈ మేరకు ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సముద్ర గర్భంలో ప్రయాణించడం అంటే అదో సాహసోపేతంతో కూడిన కల అని చెప్పారు. ఇలాంటి సాహసాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఎన్నో ముందు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రమాదం జరిగిన వెంటనే సముద్ర అన్వేషణకు వెళ్లిన బృందంలోని ఒకరు తనకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ఆ సమాచారం ప్రకారం.. ఒక గంటలో ఏం జరిగిందో తాను ఓ అంచనాకు వచ్చినట్లు వివరించారు.
‘టైటాన్ సబ్ తో సంబంధాలు తెగిపోయిన తర్వాత పెద్ద శబ్ధం వినిపించింది. దాన్ని హైడ్రో ఫోన్ ద్వారా విన్నాం. ఆ తర్వాత ట్రాన్స్ పాండర్‌తో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దాంతో మినీ సబ్‌మెరైన్ పేలిపోయి ఉంటుందని గ్రహించా. అలా జరిగినప్పుడు అందులో ఉన్న ఐదుగురు బతికే అవకాశం లేదని భావించా. ఆ సమయంలో వాళ్లు 3500 మీటర్ల లోతులో ఉన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే 3800 మీటర్లు అంటే సముద్రం అడుగుకు వెళ్లిపోయి ఉంటారని అనుకున్నాం’ అని తెలిపారు.
అయితే, టైటానిక్ (Titanic) ఘోరం జరిగిన ప్రదేశంలోనే తాజా ఘటన జరగడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని కామెరూన్ తెలిపారు. ఆ ప్రాంతంలో భారీ ఐస్ గడ్డ ఉందని, ఓడ దాన్ని ఢీ కొట్టబోతోందని అప్పటి కెప్టెన్ పదే పదే హెచ్చరించినట్లు చెప్పారు. అర్ధరాత్రిలో టైటానిక్ ఓడ ఆ భారీ మంచు గడ్డను ఢీ కొట్టి ముక్కలై మునిగిపోయిందని, దాని ఫలితంగా వందలమంది ప్రాణాలు సముద్రంలో కలిసిపోయాయని గుర్తు చేశారు. అంతటి ప్రమాదకరమైన ప్రాంతంలో అప్రమత్తతో వ్యవహరించాలన్నారు. ఓషన్ గేట్ మినీ సబ్ మెరైన్ కు లేటెస్ట్ టెక్నాలజీ సెన్సర్లు అమర్చారని, అయితే ప్రమాదానికి ముందు మెరైన బాడీకి పగుళ్లు వచ్చి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
ఆ సమయంలో మెరైన్ లో ఉన్నవారికి కచ్చితంగా సంకేతాలు వెళ్తాయని చెప్పారు. అప్పుడు వాళ్లు వెంటనే స్పందించి అందులో నుంచి బయటపడే ప్రయత్నం చేయాలన్నారు. అయితే ఈలోపే జరగరాని నష్టం జరిగిపోయి ఉంటుందని, మినీ సబ్ విచ్ఛిన్నం అయి అందులోని వారంతా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని కామెరూన్ తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన 73 ఏళ్ల పాల్ హెన్నీ తనకు స్నేహితుడని, అతను 25 ఏళ్లుగా తెలుసని చెప్పారు. పాల్ మరణం విషాదకరం అని అన్నారు. సముద్ర గర్భంలో పరిశోధనల బృందానికి డైరెక్టర్ గా పని చేసిన పాల్.. 37 సార్లు టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని సందర్శించాడు. ఇప్పుడు ఇలా మినీసబ్ ప్రమాదంలో మరణించడం గమనార్హం.
Also Read..
Titan submersible | పేలిపోయిన టైటాన్ సబ్మెర్సిబుల్.. ఐదుగురు పర్యాటకులు జలసమాధి
Shehbaz Sharif | మహిళా అధికారిణి చేతిలోని గొడుగు తీసుకెళ్లిపోయిన పాక్ ప్రధాని.. నెట్టింట ట్రోల్స్